అసెంబ్లీ తీర్మాణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
మరో పోరాటానికి సిద్దం కావాలని సంఘ ప్రతినిధుల పిలుపు
కరీంనగర్-జనత న్యూస్
రాష్ట్రంలోని పొట్టి శ్రీ రాములు విశ్వ విద్యాలయ పేరు మార్పుపై ఆర్య వైశ్యులు భగ్గు మన్నారు. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్య వైశ్య సంఘాల ప్రతినిధులు. ఈ మేరకు రాష్ట్రంలోని ఆయా జిల్లా ల్లోని ముఖ్య ప్రతినిధులు సమావేశమై భవిష్యత్ ఉద్యమ కార్యచరణపై చర్చించారు. పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ ఛైర్మన్ ఉప్పుల రామేశం, ప్రతినిధులు కన్న కృష్ణ, కొమురవెల్లి వెంకటేశం, గుండ చంద్రమౌళి, ఎలగందుల మునిందర్, జానీ శ్రీనివాస్, పడకంటి శ్రీనివాస్, రామిడి శ్రీధర్, కైలాస నవీన్, జీడిగే సాయి తదితరులు కరీంనగర్‌లో సమావేశ మయ్యారు. శుక్రవారం క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం, త్యాగాలను వారు వివరించారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ వెంట వారు నడిచారని..అలాంటి మహనీయుని పేరుపై ఉన్న విశ్వ విద్యాలయ పేరు మార్చడం జాతిని అవమాన పర్చడమే నని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని..లేని పక్షంలో మరో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.