Saturday, March 14, 2026

ఆమె కార్పొరేటర్.. ఆయనదే పెత్తనం..

  •  కరీంనగర్ కార్పొరేషన్‌లో మహిళా కార్పొరేటర్ల భర్తలదే హవా
  •  అటు ఆఫీసులో.. ఇటు నగరంలో..
  •  భూ కబ్జాలు, సెటిల్‌మెంట్ల ఆరోపణలు
  •  తాజాగా ఇద్దరు కార్పొరేటర్ల భర్తలు అరెస్ట్

(కరీంనగర్, జనతా ప్రతినిధి)
అవనిలో సగం.. అధికారంలో సగం.. హక్కుల్లో సగం.. ప్రజాపాలనలో సగం.. అన్నింటా సగం.. ప్రజాస్వామ్య భారతదేశంలో మహిళలకు మనమిచ్చే గౌరవం సముచితం. 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. పాలనలోనూ పెద్దపీట వేస్తుండగా.. కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం.. భర్తల పెత్తనమే కొనసాగుతోంది. మెజారిటీ మహిళా కార్పొరేటర్లు లెటర్ ప్యాడ్ లకే పరిమితం కాగా.. వారి పేరు చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు కొందరు కార్పొరేటర్ల భర్తలు. ఇందుకు ఇటీవల భూ ఆక్రమణ కేసులో ఇద్దరు మహిళా కార్పొరేటర్ల భర్తల అరెస్టే నిదర్శనం కాగా.. మరికొంత మంది మహిళా కార్పొరేటర్ల భర్తలు సైతం భూ ఆక్రమణలు.. ఇతర దందాలు.. అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

మొదటి నుంచి అంతే..

కరీంనగర్ కార్పొరేషన్ లో మొదటి నుంచే భర్తల పెత్తనం కొనసాగుతోంది. చాలా మంది ఆయా డివిజన్లలో మహిళా రిజర్వేషన్ల ప్రకారం తమ భార్యలను పోటీలో నిలబెట్టి గెలిచిన తరువాత వారి పెత్తనాన్నే కొనసాగిస్తున్నారు. మహిళా కార్పొరేటర్లను కేవలం లెటర్ ప్యాడ్ సంతకానికే పరిమితం చేస్తూ.. డివిజన్లలో నగరంలోని అన్ని పనులకు వారే ముందుంటున్నారు. డివిజన్లో ప్రజలను కలవడంతో పాటు.. ఇంటి పర్మిషన్లు.. పంచాయితీలు.. ఇతర అనుమతులు కావాలంటే.. ముందుగా తమను ప్రసన్నం చేసుకుంటేనే కార్పొరేటర్ సంతకం పెడుతారనే సంకేతం ఇస్తున్నారు. డివిజన్లో ఏ కార్యక్రమం అయినా.. ముందుగా తమ పేరు ఉన్నాకే ఆ మహిళా కార్పొరేటర్ పేరు కనిపించాని హుకుం జారీ చేస్తున్నారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు.. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా వారే ముందు వరుసలో ఉంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు.. పార్టీ సమావేశాలు.. కార్పొరేషన్లో సమీక్షలు ఇలా ఏ సమావేశం జరిగినా వేదికపై పతులు.. వేదిక కింద మహిళా కార్పొరేటర్లు కూర్చోవడం చాలా సందర్భాల్లో కనిపిస్తోంది.

మా ఆయనకే తెలుసు..

కరీంనగర్ కార్పొరేషన్‌లో మహిళా కార్పొరేటర్లు సుమారు 30మందికి పైనే ఉంటారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే 20 మంది వరకు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు సీనియర్ మహిళా కార్పొరేటర్లు మినహా.. మిగితా డివిజన్లలోని మహిళా కార్పొరేటర్లపై వారి భర్తల పెత్తనం కనిపిస్తోంది. డివిజన్‌లో ఏ పని జరగాలన్నా.. ఇంటి అనుమతి కావాలన్నా.. కార్పొరేషన్ లో పనులు కావాలన్నా.. ‘మా ఆయనకే తెలుసు’ అనే మాట సదరు మహిళా కార్పొరేటర్ల నుంచి వినిపిస్తోంది. కార్పొరేషన్‌లో విలీన గ్రామం నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఓ మహిళా ప్రజాప్రతినిధి తమ డివిజన్ పరిధిలో ఏ పని కావాలన్నా.. తన భర్తకే తెలుసనే సమాధానం ఇస్తున్నారని అక్కడి డివిజన్ ప్రజలు చెబుతున్నారు. డివిజన్ సమస్యల నుంచి ఇంటి అనుమతులు.. కార్పొరేషన్‌లో పనులు.. పార్టీలో వ్యవహారాలు.. ఇతర సెటిల్‌మెంట్లు ఇలా.. ప్రతీ పని భార్య పదవి చాటున భర్త పెత్తనం సాగుతోందనే ప్రచారం జరుగుతోంది.

కబ్జాలు.. బెదిరింపులు..

భార్యల పదవులను అడ్డుపెట్టుకుని నగరంలోని కొందరు కార్పొరేటర్ల భర్తలు భూ కబ్జాలు.. దందాలు.. అక్రమాలు.. బెదిరింపులకు పాల్పడుతున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర శివారులో హాట్ కేకుల్లా సాగుతున్న రియల్ ఎస్టేట్ దందాల్లో పలువురు మహిళా కార్పొరేటర్ల భర్తలు తమ మార్క్ చూపుతున్నారనేది నిన్నటి ఇద్దరు మహిళా కార్పొరేటర్ల భర్తల అరెస్టులతో తేటతెల్లమైంది. తామే కార్పొరేటర్లుగా చలామణి అవుతూ.. అనుమతులకు అడ్డుపుల్లగా నిలుస్తూ.. సామాన్య ప్రజలను వేధిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెతుతున్నాయి. భూములు అమ్ముకునే వారిని.. కొనే వారిని బెదిరింపులకూ పాల్పడుతూ.. వారినుంచి కమీషన్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరైతై దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తూ.. భూములు ఆక్రమించుకుంటున్న ఉదంతాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.

నిన్న కార్పొరేటర్లు.. నేడు మహిళా కార్పొరేటర్ల భర్తలు..

నిన్నటి వరకు భూ దందాలకు పాల్పడిన కరీంనగర్ కార్పొరేటర్లపై ఉక్కుపాదం మోపిన పోలీసులు.. ఇప్పుడు నగరంలోని పలువురు మహిళా కార్పొరేటర్ల భర్తలను సైతం జైలు ఊచలు లెక్కపెటిస్తున్నారు. కమాన్ పూర్ గ్రామంలోని ఓ భూమి విషయంలో నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసిన ఓ వ్యక్తిని రూ.3 కోట్లకు పైగా టోకరా వేసిన మహిళా కార్పొరేటర్ల భర్తలు సుదగోని కృష్ణాగౌడ్, కోల ప్రశాంత్, ఏలేటి భరత్ రెడ్డిని కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరికొంత మంది కార్పొరేటర్లతోపాటు మహిళా కార్పొరేటర్ల భర్తలు భూదందా కేసుల్లో జైలుకు వెళ్లే అవకాశం ఉందని పోలీసువర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం.

కార్పొరేషన్‌లోనూ వాళ్లదే హవా..

మహిళా కార్పొరేటర్లు నగరపాలక సంస్థకు రావడం చాలా అరుదు. వారి భర్తలే వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించడం కనిపిస్తుంటుంది. ఏ అధికారి వద్దకైనా.. సమావేశానికైనా.. మేయర్‌తో సమీక్ష అయినా.. అధికారులతో సమావేశాలు అయినా అక్కడ కనిపించేది కార్పొరేటర్ల భర్తలే. ఎవరి చాంబర్ ఎక్కడ ఉందో ఇప్పటి వరకు మహిళా కార్పొరేటర్లలో చాలా మందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఇదంతా.. కార్పొరేషన్ పెద్దలకు తెలిసినా.. మౌనంగా ఉండడం కొసమెరుపు. మొత్తంగా బల్దియాలో కార్పొరేటర్ల పెత్తనం.. భూ దందాలు.. కేసులు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page