Sunday, July 6, 2025

మార్చిలోపు శనిగరం – కోహెడ రహదారి పనులను పూర్తి చేయాల్సిందే

  • అధికారులు, కాంట్రాక్టర్లపై బండి సంజయ్ ఆగ్రహం

హుస్నాబాద్, జనతా న్యూస్:కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఆర్ఐఎఫ్ నిధులతో చేపట్టిన శనిగరం – కోహెడ రహదారి విస్తరణ పనుల్లో జాప్యంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లన్నీ దుమ్మకొట్టుకుపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నా, వాహనదారులకు యాక్సిడెంట్లై గాయాల పాలవుతున్నా పట్టించుకోరా? అంటూ మండిపడ్డారు. మార్చిలోపు రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాాల్సిందేనని స్పష్టం చేశారు. అట్లాగే పనుల్లో నాణ్యత లోపించినా సహించేది లేదని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు.

ఈరోజు మధ్యాహ్నం హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని తంగళ్లపల్లికి విచ్చేసిన బండి సంజయ్ ఈ సందర్భంగా శనిగరం – కోహెడ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు అధికారులు, కాంట్రాక్టర్లపై వారి సమక్షంలో పలు ఫిర్యాదులు చేశారు. రోడ్డు పనులు సరిగా చేయడం లేదని, క్యూరింగ్ చేయకపోవడంతో ప్రతిరోజు దుమ్మురేగి నానా ఇబ్బందులు పడుతున్నామని, రోజూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎప్పుడో రోడ్డు పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ సాగదీస్తున్నారని చెప్పారు.

అక్కడే ఉన్న కాంట్రాక్టర్లతో బండి సంజయ్ ‘‘నేను కష్టపడి కేంద్రంతో మాట్లాడి సీఆర్ఐఎఫ్ నిధులు తీసుకొచ్చిన. ప్రజలకు ఇబ్బంది లేకుండా సకాలంల పనులు పూర్తి చేయాలి కదా… ఎందుకు చేయలేదు.? ఎందుకు కుంటిసాకులు చెబుతున్నారు. మీరు సిండికేట్ గా మారి ఇంకొకరిని పూర్తి చేయరు… మీరు పని చేయరు? కేంద్రం నిధులిస్తే… రాష్ట్రం బిల్లులు రాలేదని అంటున్నారు. ఆ విషయం ఎన్నడైనా మీరు చెప్పారా? కనీసం అధికారులు ఏం చేస్తున్నారు? ప్రజలకు ఇంత ఇబ్బంది కలుగుతుంటే.. ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘‘కేంద్ర నిధులతో పనులు చేస్తే బీజేపీకి పేరొస్తదనే సాకుతో పనులను ఆపేసి ప్రజలను ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర నిధులు ఎక్కడా పెండింగ్ లో లేవు. మరి ఎందుకు పని చేయడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతుంటే మీరెందుకు మా వద్దకు రాలేదు? బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రజలను ఇబ్బంది పెడతారా? పనులు సకాలంలో చేయరు. పనుల్లో క్వాలిటీ ఉండదు. టెండర్లలో సిండికేట్ గా మారి గుత్తాధిపత్యంతో అడ్డగోలుగా వ్యవహరిస్తూ ప్రజలను ముంచుతున్నారు. అడిగితే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం మీకు అలవాటైంది’’అంటూ మండిపడ్డారు..

అనంతరం అధికారులను ఉద్దేశించి చురకలంటించారు ‘‘ ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు. పనులెలా జరుగుతున్నాయో కనీసం పర్యవేక్షించారా? బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా జాప్యం చేస్తుంటే నా ద్రుష్టికి ఎందుకు తీసుకురాలేదు? ఏదో టెండర్లు పెట్టాం.. అంతటితో మా పనైపోయిందని చేతులు దులుపుకుని ప్రజలను ఇబ్బంది పెడతారా? సకాలంలో పనులు పూర్తి చేయించాలనే సోయి లేదా?’’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలకు ఇబ్బంది కలిగితే సహించే ప్రసక్తే లేదని, మార్చి నెలాఖరులోపు ఈ రహదారి పనులన్నీ పూర్తి చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యత లేకపోయినా, గడువులోగా పూర్తి చేయకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page