Thursday, September 19, 2024

Shadow Mla: షాడో ఎమ్మెల్యే

  •  ఎంతసేపూ ఆదాయంపై నజర్
  •  దందాలన్నీ ఆయనకు తెలియాల్సిందే..
  •  అధికారులకు హుకుం జారీ
(కరీంనగర్ ప్రతినిధి, జనతా న్యూస్)

Shadow Mla:కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న నియోజకవర్గమది. అక్కడ ఓటర్లు ఆయనకు తొలిసారి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీపై అభిమానమో.. సదరు అభ్యర్థిపై సానుభూతో.. బీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకతనో.. కారణం ఏదైనా కావచ్చు. ఓటర్లు మాత్రం ఆయనను ఆశీర్వదించారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కానీ.. ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని షాడో ఎమ్మెల్యే రాజ్యమేలుతున్నాడు. ఆ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసి ముచ్చటగా మూడు నెలలైనా కాకముందే షాడోను చూస్తే.. వామ్మో అంటూ పలువురు భయపడుతున్నారు.

For E Paper Click here..

Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)

అటు షాడో.. ఇటు వర్గపోరు

కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఓ వైపు షాడో ఎమ్మెల్యే జోరు కొనసాగుతుంటే.. మరోవైపు వర్గపోరు జోరుగా సాగుతోంది. ఆ నియోజకవర్గంలో సదరు అభ్యర్థి ఎన్నికలకు ముందు నుంచి షాడోకి పెద్దపీట వేశారు. పైసా నుండి మొదలుకుని ప్రతీది ఆయన కనుసన్నల్లోనే నడిచింది. లెక్కలన్నీ ఆయనకే తెలుసు. మండల స్థాయి నాయకులు ఆ నియోజకవర్గంలో ప్రచారాస్త్రాలే. ఎన్నికలకు ముందే కాదు.. ఎమ్మెల్యే అయిన తరువాత కూడా షాడోనే అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఖర్చులు చూసుకున్న ఆయన.. ఆ తరువాత ఆదాయంపై దృష్టి సారించినట్లుగా సమాచారం. అందుకే ఈ నియోజకవర్గంలో పలు విషయాల్లో ఆయన ఇప్పటికే తలదూర్చినట్లు వినికిడి. అందుకే సమయాన్ని వృథా చేయకుండా మొదటి నుంచే ఆదాయ మార్గాలను వెతుకుతూ కూడబెట్టడానికి శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో అధికారుల బదిలీలు.. అభివృద్ధి పనులు.. ప్రైవేటు దందాలు.. అక్రమ దందాలను సైతం ఆదాయా మార్గాలుగా మలుచుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం నడుస్తోంది.

అధికారులే మెట్లుగా..

నియోజకవర్గంలోని అధికారులు తమతమ పరిధిలో సాగుతున్న ప్రతీ విషయాన్ని తనకు తెలపాలని హెుకూం జారీ చేశారు. దందా సక్రమమైనా.. అక్రమమైనా తనకు తెల్సియాల్సిందేనని ఆదేశించారు. గ్రామాల్లో రియల్.. ఇసుక.. మట్టి.. బొగ్గు దందా.. ఏదానై సరే తనను కలిశాకే కొనసాగాలని చెప్పారు. లేదంటే వాటిని అడ్డుకోవాల్సిందేనని.. అభివృద్ది పనులు ఎవరు చేసినా.. తమ పర్సేంటేజీనీ ముట్టజెప్పాల్సిందే అంటూ ఇంజినీర్లకు షాడో హుకూం జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ, మండల పరిషత్ తో పాటు వివిధ శాఖల అధికారులకు సైతం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా కాదంటే బదిలీ కాగితం అందుకుంటారంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరినీ నేరుగా అడగకుండా.. ఆదాయానికి అధికారులనే మెట్లుగా ఎంచుకున్నట్లు చర్చ సాగుతోంది. షాడో చెబితే ఎమ్మెల్యే చెప్పినట్లుగానే అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. నిజంగానే షాడో వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే దృష్టిలో ఉన్నాయా..? లేదా..? అనేది అంతుచిక్కని ప్రశ్నే. షాడోను కొనసాగిస్తూ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతారా..? ఆయన్ని పక్కన పెట్టి నిజాయితీని నిరూపించుకుంటారా..? అనేది సదరు ఎమ్మెల్యేపైనే ఆధారపడి ఉన్నది.

చిరుద్యోగిపై వేటు..

నియోజకవర్గంలో ఓ చోట జరుగుతున్న అక్రమ దందా విషయంలో షాడో తన ప్రతాపాన్ని చూపినట్లు తెలుస్తోంది. అక్రమ దందాలో తమ వాటా విషయాన్ని అధికారులతో ఆయన చర్చించినట్లు ఆరోపణలున్నాయి. అయితే.. ఆ దందా అధికారులకు తెలిసి జరుగుతున్నా.. ఉన్నతాధికారి వద్ద తమదేమీ నడవని కారణంగా సదరు అధికారులను కాకుండా చిరుద్యోగిపై ఫిర్యాదు చేసి వెనక్కి పంపినట్లు విమర్శలున్నాయి. బాస్ మారితే తమను మార్చుతారంటూ సదరు అధికారులు ఇప్పటికే సన్నిహితులకు చెప్పుకుంటున్నట్లు సమాచారం. గతంలో లేని ఆంక్షలు ఇప్పుడు పుట్టుకొస్తుండడంతో పలువురు అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page