- చేసిన పనులు..చేయబోయే పనులపై హావిూలు
- వరుసగా రెండోసారీ సునాయాస విజయం
- జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఓడించిన డాక్టర్
(యాంసాని శివకుమార్ -జనతా న్యూస్)
డాక్టర్‌గా ఆయన ప్రజలకు సేవ చేసేవాడు. నిరంతరం ప్రజల్లో ఉంటూ.. వారికి ఆరోగ్య సూచనలు ఇచ్చేవారు. మారుమూల గ్రామాలను సైతం సందర్శించి కంటి జబ్బులతో బాధపడే వారికి అండగా నిలచేవారు. ఇదే గత ఎన్నికల్లో డాక్టర్ సంజయ్‌ను ఎమ్మెల్యేగాగెలిపించింది. నిరంతరం ప్రజల్లో ఉంటూ..వారికి అండగా భరోసా ఇస్తే విజయం దక్కుతుందని సంజయ్ నిరూపించారు. ప్రజల నాడి బాగా తెలిసిన వ్యక్తిగా వారికి ఎలా చెబితే నచ్చుతుందో ప్రచారంలో అలాగే చెప్పారు. అలాంటి మాటలే మాట్లాడారు. చేసిన పనులు, చేసే పనుల గురించి చెప్పి వారితో శభాష్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా రెండో పర్యాయం జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఘన విజయం సాధించచారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన ఓడిరచగలిగారు. ప్రజలంతా అండగా ఉండడంతో గెలుపు సుసాధ్యమయ్యిందని బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా సంబంరాలు చేసుకున్నాయి.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తిప్పికొట్టడంలో సంజయ్ విజయం సాధించారు. జీవన్ రెడ్డి బాండ్ పేపర్ల విన్యాసాన్ని కూడా ప్రజల్లో చర్చ చేసేలా చేశారు. కాంగ్రెస్ నాయకులు దొంగ బాండ్ పేపర్లతో వస్తున్నరు. నమ్మితే మోసపోయి గోసపడుతం. జీవన్‌రెడ్డి నిజంగా ప్రజల కోసం పనిచేసి ఉంటే బాండ్ పేపర్ రాసిచ్చే పరిస్థితి వచ్చేదా అంటే తన ప్రచారంలో హైలెట్ చేశారు. ఇది కూడా ఆయనకు బాగా కలసి వచ్చిందని అంటున్నారు. మరోవైపు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కూడా సంజయ్‌కు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహించడం కూడా కలసి వచ్చింది. జగిత్యాలను జిల్లాగా చేశామని, బీర్‌పూర్‌ను మండలంగా, రాయికల్‌ను మున్సిపల్‌గా చేశామన్న ప్రకటనలు కూడా సంజయ్‌కు కలసి వచ్చాయి. చేసిన పనులగురించి ప్రస్తావించి ప్రజల్లో మార్కులు కొట్టేశారు.
జిల్లా అయిన తర్వాత జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని, ఇండ్లు లేని పేదలు ఉండవద్దనే ఉద్దేశ్యంతో జగిత్యాల పట్టణానికి 4500 ఇండ్లు మంజూరు చేసి, చాలామట్టుకు పంపిణీ కూడా చేశామన్నారు. గడిచిన ఐదేండ్లలో ప్రజలు కోరినవన్నీ చేశామన్నారు. 50ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ నాయకుడైన జీవన్‌రెడ్డి ఏం పరిపాలన చేయలేదని, నేడు బాండ్ పేపర్ రాసి, దేవుని ముందు పెట్టి వస్తున్నాడని, ఇంతకన్నా దారుణమైన విషయం మరోటి ఉండదన్న ప్రచారం ద్వారా జీవన్ రెడ్డిని నిలదీసేలా చేశారు. నిజంగా ప్రజలకు సేవ చేసిఉంటే, ప్రజలు కోరిన ప్రకారం పనిచేసి ఉంటే, ప్రజల కోసమే పనిచేసుంటే జీవన్‌రెడ్డి బాండ్ పేపర్ రాసే అవసరం ఉండదన్నారు. అంతేగాకుండా పలు కీలక హావిూలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకోగలిగారు. రెండోసారి గెలిపించిన తర్వాత తొలి ప్రాధాన్యతగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని,బీడీ కార్మికులకు రూ.3వేల పెన్షన్‌ను అందిస్తామన్నారు.
అలాగే ఏ ఆధారం లేని వారికి రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా పేరుతో రూ.5లక్షల ఉచిత బీమా కల్పిస్తామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 15లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని, రైతు బంధును రూ.16వేలకు పెంచుతామని, ఎన్నారై పాలసీని ఏర్పాటు చేస్తామని, గల్ఫ్ కార్మికులకు సైతం రూ.5లక్షల బీమా కల్పిస్తామన్నారు. ఆసరా పెన్షన్‌ను రూ.5వేలకు, దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6వేలకు పెంచుతామన్నారు. రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం అందిస్తామన్నారు. కర్ణాటకలో 2.60లక్షల ఉద్యోగాలు ఖాలీగాఉన్నాయని, నెల రోజుల్లో భర్తీ చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఆరు నెలలు గడుస్తున్నా కనీసం ఉద్యోగాల భర్తీకి పక్రియను కూడా ప్రారంభించలేదని, ఇక్కడేమో పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు.
తెలంగాణ రాష్టాన్న్రి 50ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మనకు కనీసం మంచినీళ్లు కూడా పూర్థి స్థాయిలో ఇయ్యలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో కరంటు, కల్యాణలక్ష్మి, పెన్షన్‌లు, అభివృద్ధి, సంక్షేమం ఏదీ ఉండదన్నారు. అబద్ధాలే అలవాటు ఉన్న జీవన్‌రెడ్డి మనం ఎప్పుడో రద్దు చేసిన మాస్టర్ ప్లాన్ గురించి దుష్పచ్రారం చేస్తున్నాడని, జగిత్యాల ప్రజల అభీష్టం మేరకే మాస్టర్ ప్లాన్‌ను రూపకల్పన చేస్తామన్నారు. అల్లీపూర్‌ను మండలంగా చేస్తామన్నారు. బీసీ బంధును పెంచుతామని, దళిత బంధును కొనసాగిస్తామని, కొత్తగా గిరిజన బంధును సైతం తెస్తామని వివరించారు. ఇలా హావిూలను ఇస్తూ ప్రజల్లో తనకున్న ఇమేజ్ కారణంగా వారిని నమ్మించారు. అందుకే కాంగ్రెస్ హవా ఉన్నా ఆయన గెలిచాడు. వైద్యుడిగా ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా గెలుపును ఖాతాలో వేసుకున్నాడు.