Saturday, July 5, 2025

సన్నరకం వడ్లకు అదనంగా రూ. 500 బోనస్‌..

ప్రతీ సెంటర్‌కో నెంబర్‌ కేటాయింపు..
గన్ని బ్యాగులు, టార్పలిన్లను అందుబాటులో ఉంచుకోవాలి
కోనుగోళ్లపై 24/7 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు
దసరా లోగా టీచర్‌ నియామక పత్రాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్‌ రెడ్డి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌
హైదరాబాద్‌ :
వరిధాన్యం సేకరణలో సన్నబియ్యానికి అదనంగా క్వింటాల్‌ కు 500 రూపాయల బోనస్‌ ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఖరీఫ్‌ 2024-25 వరిధాన్యం కొనుగోళ్లు , డీఎస్సీ సర్టిఫికెట్‌ వెరీఫికేషన్‌, నియామకం ఆర్డర్లపై హైదరాబాద్‌ లోని సచివాలయం నుండి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, డిజిపి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. గతానికి భిన్నంగా ఈ సీజన్‌ నుంచి సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కౌంటర్లు , కాంటాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో సరిపడా ప్యాడి క్లీనింగ్‌ మెషిన్స్‌ అందుబాటులో ఉంచాలని, టోకెన్‌ పద్ధతి పాటించాలని, రైతులకు సరిపడు టార్పాలిన్‌ కవర్స్‌ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏరోజుకు ఆ రోజు ధాన్యం నాణ్యత పరీక్షించి రికార్డులో నమోదు చేయాలని తెలిపారు. సన్నరకం, దొడ్డురకం వడ్లను గుర్తించుటకు గాను గ్రెయిన్‌ కాలిపర్స్‌ (సన్న వరి గుర్తింపు కోసం డయల్‌ మైక్రో మీటర్‌) ప్రతి కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉంచుకోవాలని అధికారులని ఆదేశించారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా ఉంటాలంటే ఐకేపీ సెంటర్లకు సీరియల్‌ నెంబర్లను ఇవ్వాలని, అదే నెంబర్లను దాన్యం బస్తాల మీద వేయాలని, వీటి కోసం రెవెన్యూ సెక్రేటరీలను నియమించాలని ఆదేశించారు. గన్ని బ్యాగులు, టార్పలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని, వర్షాకాలం అయినందున వర్షం పడే అవకాశం ఉన్నందున ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడవకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 24 / 7 కాల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేయాలని, ఎక్కడ ఏ రైతుకు సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం చేసే విధంగా కాల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. పక్క రాష్ట్రం నుండి ధాన్యం తెచ్చి ఇక్కడ అమ్మే అవకాశం ఉన్నందున పోలీస్‌ అధికారులు బార్డర్‌ ల వద్ధ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి చెక్‌ చేస్తుండాలని ఆదేశించారు. ప్రతిరోజు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహించి తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసేవారిపై అవసరమైతే క్రిమినల్‌ కేసులు పెట్టాలని సిఎం ఆదేశించారు. డీఎస్‌సీలో 1:3 క్రింద 25, 239 మందిని ఎంపిక చేసి ఫలితాలు ప్రకటించామని, ఇప్పటి వరకు 9090 మాది అభ్యర్థులు సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ జరిగిందని అన్నారు. 2 రోజుల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని, అక్టోబర్‌ 9 సాయంత్రం 4 గంటలకు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్‌ ఆర్డర్లు జారీ చేయాలని అన్నారు. దసరా కంటే ముందు టీచర్ల నియామకం పూర్తి కావాలని ఆదేశించారు.
రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. దొడ్డు రకం ధాన్యానికి ప్రపంచంలో డిమాండ్‌ తగ్గిపోతుందని, కేంద్ర ప్రభుత్వం కూడా కొనుగోలు తగ్గించిందని అన్నారు. ప్రజలకు అందించే రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, దుర్వినియోగాలను అరికట్టేందుకు జనవరి నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 60 శాతం మేర సన్న రకం ధాన్యం సాగు చేశారని, ప్రభుత్వం 91 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టిందన్నారు. దాదాపు 47 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న వడ్ల కొనుగోలు చేయబోతున్నామని అన్నారు. జిల్లా స్థాయిలో అవసరాల మేరకు నూతన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో కరీంనగర్‌ నుండి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సీపీ అభిషేక్‌ మహంతి , అదనపు కలెక్టర్‌ లు ప్రఫుల్‌ దేశాయ్‌, లక్ష్మి కిరణ్‌ , వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page