దేవుడి పేరుతో బిజెపి రాజకీయం
బిజెపి బీఆర్ఎస్ కుమ్మక్కు
జమ్మికుంట సభలో సీఎం రేవంత్ రెడ్డి
హుజూరాబాద్, జనత న్యూస్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి మరోసారి వస్తే బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసివేస్తుందని ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బహిరంగ సభ జరిగింది. దీనికి హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బిజెపి ఇప్పటికే సిఏఏ, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిందని, మరోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. బిజెపి రిజర్వేషన్లను రద్దు చేస్తుందని నేను చెప్తే ఢిల్లీ నుండి పోలీసులను బిజెపి నేతలు పంపించారని ఆయన మండిపడ్డారు. తనకు కేసులు కొత్త కాదని గతంలో కెసిఆర్ ప్రభుత్వం తనపై ఎన్నో కేసులు పెట్టిన భయపడలేదని అన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, ఆయన తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. గాడిద గుడ్డు పేరుతో ఓ బొమ్మను రేవంత్ ప్రదర్శించారు. బిజెపి నేతలు దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. శ్రీరామనవమి, హనుమత్ జయంతి పండుగలను హిందువులు అందరూ జరుపుకుంటారని తెలిపారు.

మాదే హిందుత్వం అనే పద్ధతిలో బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని తమ కంటే గొప్ప హిందువులు ఎవరూ లేరని సీఎం అన్నారు. అయోధ్యలో రాముని కళ్యాణం జరగకముందే అక్షింతలు పంపిణీ చేశారని చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బిజెపి చేసింది ఏమీ లేదని, తెలంగాణ రాష్ట్రానికి అరగుండు బోడి గుండు ఇద్దరు ఏమి చేసింది లేదని బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని నాడు కెసిఆర్ కు మద్దతు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ గారు షెడ్డు కు పోయిందని అంటున్నారని కానీ అది బాగు కాదని తూకానికి పోవడం ఖాయమని అన్నారు. బిజెపి 200 స్థానాలు గెలుచుకుంటుందని కాంగ్రెస్కు 40 సీట్లు వస్తాయని కెసిఆర్ చెప్తున్నారని.. దీన్నిబట్టి ఆయన బిజెపికి పూర్తి మద్దతు ఇస్తున్నట్టుగా అర్థం అవుతుందని అన్నారు. కేంద్రంలో సంకీర్ణ వస్తుందని నామ నాగేశ్వరరావును కేంద్ర మంత్రిని చేస్తామని కేసీఆర్ నిన్న సభలో చెప్పారని.. తద్వారా కెసిఆర్ బిజెపిలో చేరపోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చారని అన్నారు. ఇండియా కూటమిలో బి ఆర్ ఎస్ పార్టీని చేర్చుకునే ప్రసక్తే లేదని, వేరే ఇంటి మీద వాలిన కాకి తమ ఇంటిపై వాడడానికి వీలులేదని వస్తే కాల్చిపడేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని రేవంత్ అన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని, ఈ విషయాన్ని గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలకు రైతులకు వివరించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చింది కార్యకర్తలేనని అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్ అని, సెమీఫైనల్ లో బిఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించారని, రేపు జరగబోయే ఫైనల్ లో బిజెపిని ఇంటి ముఖం పట్టించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రణవ్ పేరును ప్రస్తావించిన రేవంత్
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలకు 14 రోజుల ముందే తాము కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా.. ప్రణవ్ పోటీ చేస్తే ప్రజలు మద్దతుకి ఇచ్చారని, ప్రణవ్ 54 వేల ఓట్లు సాధించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే.. తల్లి లాంటి తమ పార్టీని గుండెల పై తన్నిన నాయకుడు వేరే పార్టీలో చేరాడని పరోక్షంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. హుజరాబాద్ లో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి బల్మూరి వెంకట్ అండగా నిలిచారని సీఎం ప్రశంసించారు.
రాజేందర్ రావు ను గెలిపించాలి
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజేందర్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని.. సి ఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వారి కుటుంబం ప్రజాసేవ నుండి వచ్చిందని.. వారి తండ్రి జగపతిరావు.. ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ప్రజా సేవ చేశారని గుర్తు చేశారు. ఈ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సక్సెస్ తో కాంగ్రెస్ లో ఆనందోత్సాహాలు
హుజూరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట పట్టణంలో శనివారం జరిగిన కరీంనగర్ పార్లమెంటరీ ఎన్నికల ప్రచార సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది. నియోజకవర్గం నలుమూలల నుండి వేలాది సంఖ్యలో జనం హాజరయ్యారు. హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి వొడితల ప్రణవ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. మండుటెండ ను సైతం లెక్క చేయకుండా జనం సభకు హాజరయ్యారు. సభ సక్సెస్ చేసేందుకు కృషి చేసిన అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
సభ విజయవంతమైంది : ప్రణవ్
జమ్మికుంట పట్టణంలో మంగళవారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయవంతమైందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రణవ్ తెలిపారు. సభకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో ఉత్సాహం నింపారని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీ వస్తుందని ఉందని ఆయన తెలిపారు. సభకు హాజరైన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ, పట్టుదల వల్లే సభ విజయవంతం అయిందని ఆయన అన్నారు.