Wednesday, September 18, 2024

రిజర్వేషన్ల ‘పంచాయతీ’

తేలని బీసీ రిజర్వేషన్ల లెక్క..
సంఘాల ఆందోళన బాట
సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయంపై ఉత్కంఠ

జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి

పంచాయతీ ఎన్నికలెప్పుడు ? ఈ నెలలోనా..లేక బీసీ గణన చేపట్టాకనా..? ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే..బీసీలకు కేటాయించే రిజర్వేషన్ల సంఖ్య ఎంత ? ఇలా అనేక సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. బీసీ గణన పూర్తి చేసి 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాకనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు ఇప్పటికే ఉద్యమాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో..ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

‘ఈ నెలాఖరు వరకు పంచాయతీ ఎన్నికలు జరగవచ్చు. క్యాడర్‌ సిద్దంగా ఉండాలి’ కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షులు, అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఇచ్చిన పిలుపు ఇదీ.

దీన్ని బట్టి చూస్తే..ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు ఒకటి రెండు మాసాల్లో నిర్వహించే అవకాశాలున్నట్లు స్పష్టమౌతోంది. పాలక వర్గ కాల పరిమితి ముగిశాక ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించకుంటే..కేంద్రం నుండి వచ్చే నిధులు నిలిచి పోయే అవకాశాలున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు లేక పోలేదు. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణకు ప్రస్తుత పరిస్థితుల్లో నిధులు సమకూర్చుకోవడమూ అవసరమే. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడమా..లేక కుల గణన పూర్తి చేశాక నిర్వహించడమా..? ఇందులో దేనిపై మొగ్గు చూపనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
2019లో బీసీలకు తక్కువగా కేటాయింపు..
ఎస్‌సి, ఎస్‌టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం కన్నా మించరాదనే సుప్రిం కోర్టు ఆదేశాలతో..అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించింది. మొత్తం 60.55 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి తగ్గించింది. బీసీల రిజరేషన్లు మాత్రమే 10 శాతానికి పైగా తగ్గించింది అప్పటి టీఆర్‌ఎస్‌ సర్కారు. గతంలో ఉన్న 34 శాతాన్ని 22.79 కి తగ్గించడంతో అప్పుడు బీసీ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.
కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ అమలయ్యేనా.?
తాము అధికారంలోకి వచ్చాక 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ప్రతీ సభలోనూ దీనిపై విస్తృతంగా ప్రచారం చేసింది కూడ. ఇందుకు అనుగుణంగా అసెంబ్లీలో తీర్మాణాన్ని కూడా చేసింది సర్కారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా..కుల గణన చేపట్టేందుకు కనీసం నాలుగు మాసాల సమయం పడుతుంది. ఆ తరువాత రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు మరింత సమయం పడే అవకాశాలున్నాయి. సుమారు ఆరు నెలలైనా సమయం పట్టే అవకాశాలున్నాయి. పంచాయతీ పాలక వర్గాల కాల పరిమితి పూర్తయి ఆరు నెలలు దాటితే..కేంద్రం నుండి వచ్చే నిధులు నిలిచి పోతాయనే సందేహాలు వ్యక్త మౌతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంగ్దిద్దంలో పడ్డట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం అనివార్యంగా ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతుంది.
కరీంనగర్‌ జిల్లాలో..ఇవీ గత రిజర్వేషన్లు !
2019 ఎన్నికల్లో కరీంనగర్‌ జిల్లాలో 313 గ్రామ పంచాయతీల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు. ఎస్‌సిలకు 80, బీసీలకు 73కు గాను 37 మహిళలు..36 బీసీ జనరల్‌ కేటాయించారు. 156 పంచాయతీలకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించలేదు. అంతకు ముందు 30 ఏళ్లుగా 34 శాతం బీసీ రిజర్వేషన్లతో పంచాయతీ, ఇతర స్థానిక ఎన్నికలు జరుగగా..గత ఎన్నికల్లో 12 శాతం తగ్గించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ల కేటాయింపు, ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌ సర్కారుకు సవాల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో అటు న్యాయస్థానం ఆదేశాలు, ఇటు బీసీ సంఘాల సమన్వయం..సీఎం రేవంత్‌ రెడ్డికి తలనొప్పిగా మారింది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page