మహారాష్ట్ర భక్తునితో ప్రారంభం..
రోజుకు రెండు సార్లు..
ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు
వివరాలు వెల్లడిరచిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ-జనత న్యూస్
శ్రావణమాసం తొలిరోజు సోమవారంతో రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర నుండి వచ్చిన భక్తునితో కలసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఉదయం 10 :15 నుండి 11: 15 వరకు మధ్యాహ్నం 4 నుండి 5 గంటల వరకు బ్రేక్ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. టికెట్ ధర రూ. 300 చొప్పున చెల్లించి ఆన్‌లైన్లో గాని, నేరుగా కాని పొందే అవకాశం కల్పించారు ఆలయ అధికారులు. బ్రేక్ దర్శన సౌకర్యం కల్పించడం వల్ల సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పావు గంటలో రాజన్న దర్శనం చేసుకుని..తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం కల్పించారు. బ్రేక్ దర్శనం వల్ల ఆలయానికి ఆదాయం కూడా పెరిగే అవకాశాలున్నాయి. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, దూర ప్రాంత భక్తులకు వెసులుబాటు కలిగే విధంగా బ్రేక్ దర్శనం ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా తొలి దర్శనం చేసుకున్న మహారాష్ట్ర భక్తుడు సంతోషం వ్యక్తం చేశాడు.
ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు విడుదల
శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బ్రేక్ దర్శనం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి ఏడాదికి రూ. వంద కోట్లు మంజూరు చేస్తామని, విస్మరించిందని..తమ ప్రభుత్వం హామీ ఇవ్వకున్నా..ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి, నిధులు విడుదల చేసిందని తెలిపారు. శృంగేరి పీఠాధిపతులతో చర్చించి..ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాజన్న ఆలయంలో.. బ్రేక్ దర్శనం..
- Advertisment -