Rahul Gandhi: వరంగల్, జనతా న్యూస్: కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన విజయభేరి యాత్ర బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయం నుంచి ప్రారంభం అయింది. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భేగంపేటకు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఆ తరువాత రామప్ప ఆలయం నుంచి బయలుదేరి ములుగులో నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. తెలంగాణకు మాట ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని అన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి వాటిని విస్మరించారన్నారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ మోసం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోట్లు జేబులో వేసుకున్నారన్నారు.

తెలంగాణ కోసం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పథకం తీసుకొచ్చిందని, వీటి ద్వారా ప్రజల జీవితాలు బాగుంటాయని అన్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేసిందని చెప్పారు. రూ.2,500తో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని రాహుల్ గాంధీ తెలిపారు.