నిబంధనలు పాటించాల్సిందే !
జిల్లా కలెక్టర్ పమేల సత్పతి
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పై సమీక్ష
కరీంనగర్-జనత న్యూస్
ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిస్ట్రీక్ రిజిస్ట్రేషన్ అథారిటీ(డీఆర్‌ఏ) ఆధ్వర్యంలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ పై కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు నరేశ్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఏ చైర్ పర్సన్, కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ప్రతి ఆసుపత్రిలో రిసెప్షన్ సెంటర్ వద్ద వైద్య సేవల వివరాలు, చార్జీలు, వైద్యుల వివరాలతో కూడిన నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య మహిళ పథకం గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని.. నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఐదు బెడ్ల కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఆసుపత్రి విధిగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 50 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలన్నారు. పాత ఆస్పత్రుల నిర్వాహకులు ఆరు నెలల్లోగా పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. బయో మెడికల్ వ్యర్థాలను.. మున్సిపాలిటీకి అందించే వ్యర్థాలతో కలుపవద్దని సూచించారు. అన్ని పత్రాలు తీసుకున్న ఆసుపత్రులకు అనుమతులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రపుల్ దేశాయ్, డీఆర్‌ఏ కన్వీనర్ ,డీఎంహెచ్ వో సుజాత, నగరపాలిక కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ట్రెయినీ ఐఏఎస్ అజయ్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు..

- Advertisment -