Thursday, September 19, 2024

పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు

ఓటరు జాబితాపై కమిషన్‌ కసరత్తు
సెప్టెంబర్‌ 6 నుండి 21 వరకు చేర్పులు-మార్పులు
నవంబర్‌ వరకు ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలు

జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఓటరు తుది జాబితా ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెప్టెంబర్‌ 6 నుండి 21 వరకు ఓటరు జాబితాను రూపొందించి ప్రదర్శించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ పార్థ సారథి. అయితే..బీసీ రిజర్వేషన్ల పెంపు విషయమై ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు. ఓటరు జాబితా పూర్తయ్యే లోపు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఓ నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు స్ఫష్టం చేస్తున్నాయి. సంవత్సరం లోపు ఎన్నికలు నిర్వహించకుంటే..కేంద్ర ప్రభుత్వ నిధులు నిలిచి పోనున్నందున ఈ సంవత్సరం చివరిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

ఫిబ్రవరి 2న పంచాయతీ పాలక వర్గ కాల పరిమితి ముగిసింది. ఆరు నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి నిలిచి పోయింది. పాలక వర్గం లేక పోవడంతో పాటు సుమారు 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల నిధులు నిలిచి పోవడంతో పంచాయతీల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. కనీసం సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించి, పాలక వర్గ ఏర్పాటు అనివార్యమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్ఫష్టత రాకున్నప్పటికీ..రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ మాత్రం తన పని తాను చేసుక పోతుంది.

ఓటర్ల జాబితాలో చేర్పులు-మార్పులకు ఆదేశాలు
పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు తొలి అడుగు వేసింది రాష్ట్ర ఎన్నికల కమీషన్‌. ఇందుకు గాను ఈ నెల 21న ఎన్నికల కమీషనర్‌ పార్థసారథి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఓటర్ల తుది జాబితాకు సంబంధించిన షెడ్యుల్‌ విడుదల చేశారు. సెప్టెంబర్‌ 6 నుండి 21 వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అధికారులు ప్రత్యేక కసరత్తు చేయనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబిత ప్రదర్శన, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు, ఓటర్ల జాబితాలో చేర్పులు`మార్పులు చేసి వచ్చే నెల 21న ఓటర్ల తుది జాబితాను ప్రదర్శించనున్నారు.

బీసీ రిజర్వేషన్ల పెంపుపై సంగ్ధిద్దం
బీసీ కుల గణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో ప్రభుత్వం ఏక గ్రీవ తీర్మాణం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పాలక వర్గం గడువు ముగిసి ఆరు మాసాలు అవుతుంది. ఒకవైపు ఓటరు జాబితాపై ఎన్నికల కమీషన్‌ కసరత్తు చేస్తుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టి ఎన్నికలు నిర్వహిస్తుందా..? లేక ఓటరు జాబితా ఆధారంగా బీసీల రిజర్వేషన్‌ను కొంత మేరకు పెంచుతుందా..? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. సుంప్రిం కోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50శాతంకు మించరాదు. దీంతో బీసీల రిజర్వేషన్‌ మరో 5 శాతం వరకు మాత్రమే పెరిగే అవకాశాలుంటాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్న 42 శాతం పెంపుపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

కరీంనగర్‌ జిల్లాలో గత రిజర్వేషన్లు..
2018 ఎన్నికల నోటిఫిషన్‌లో కరీంనగర్‌ జిల్లాలో 313 పంచాయతీల్లో 100 శాతం ఎస్టీ 1, ఎస్టీ మహిళ 2, జనరల్‌ 1..ఎస్సీ కేటగిరీ 80 పంచాయతీల్లో 40 మహిళలలు, మరో 40 జనరల్‌..బీసీల్లో 37మహిళ, 36 జనరల్‌..అన్‌ రిజర్వేషన్‌ కేటగిరిలో 156 పంచాయతీల్లో సగం మహిళలకు కేటాయించగా, మరో సగం జనరల్‌గా విభజించారు. ఈ ఎన్నికల్లో ఏ ప్రాతిపదికన బీసీల సీట్ల పెంపు ప్రక్రియ చేపడుతారనేది అంతుచిక్కడం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుండి స్ఫష్టత రావాల్సి ఉంది. మొత్తానికి మాత్రం ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page