- ఎన్నికల్లో పంచడానికే రూ.6.60 కోట్లు తెచ్చాడు
- బంధువుల ఇళ్లలో ఇంకా ఎన్నో కట్టలున్నాయి..
- ప్రజల ఆదరణ లేకపోవడంతో ఓట్లు కొనే ప్రయత్నం
- కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు సంచలన ఆరోపణలు
(కరీంనగర్, జనతా న్యూస్)
కరీంనగరంలోని నడిబొడ్డున గల ప్రతిమ మల్టిప్లెక్స్‌లో పోలీసులకు దొరికిన రూ.6.60 కోట్ల డబ్బు ముమ్మాటికీ ఎన్నికల డబ్బేనని.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకే బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ తీసుకొచ్చాడని కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం.. వచ్చేసారి గెలవడం కష్టమైన నేపథ్యంలో ఓటుకు నోటు లెక్కన కొనేందుకు వినోద్ పెద్ద ఎత్తున కోట్ల డబ్బును పట్టుకొచ్చాడని.. దొరికింది చాలా తక్కువ అని వెలిచాల పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బడుగు బలహీన వర్గాలను కొనడం కోసమే ఈ డబ్బు ఇక్కడకు తరలించారని ఆయన ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఆ నగదు తెచ్చారని తెలిపారు. కరీంనగర్‌లో ఉన్న ప్రతిమ మల్టీప్లెక్స్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ బంధువులదని.. అందుకే అక్కడ డబ్బు దాచిపెట్టారని తెలిపారు. ఆరున్నర కోట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో ఇంకా వినోద్‌కు సంబంధించిన బంధువుల ఇళ్లలో కోట్ల డబ్బును దాచి ఉంచారని.. అదంతా కూడా బయటకు తీస్తామని హెచ్చరించారు. కరీంనగర్ కదనభేరి సభకు ప్రజలు, నేతలు రాకపోతే డబ్బులిచ్చి తీసుకొచ్చారని.. స్వచ్ఛందంగా ఎవరూ రాలేదని విమర్శించారు. బీఆర్ఎస్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గిపోయిందని.. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కావడం కూడా దీనికి ఉదాహరణ అని వెలిచాల పేర్కొన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్‌కు, వినోద్‌కు ఎలాంటి సానుభూతి లేదని తెలిపారు. ఈరోజు దొరికిన డబ్బు కేవలం ఎన్నికలకు సంబంధించి పెట్టుబడిగా తీసుకొచ్చిందేనని వెలిచాల ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఓటు పడే పరిస్థితి లేదని తెలిపారు.
డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులకు అభినందనలు తెలియజేశారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి అరాచకాలు అడ్డగోలుగా జరిగాయని.. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి సాగవని వెలిచాల హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని.. అందరికీ మంచి చేస్తుందని.. ఇలాంటి అనైతిక పనులను బీఆర్ఎస్, బీజేపీ నేతలు మానుకోవాలని.. లేకుంటే జైలు పాలు కాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల్లో కోట్లు కుమ్మరించి గెలవడం కాకుండా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికవ్వాలని.. తప్పుడు మార్గంలో వెళ్లి ప్రజలను మరోసారి భ్రమ పెట్టాలని చూస్తే అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని.. తగిన బుద్ధి చెబుతామని వెలిచాల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును భ్రష్టుపట్టించి.. ప్రజల సొమ్ము అనకొండలా లాగా మింగేసి.. మళ్లీ దాన్ని ప్రజలను కొనే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని.. బోయినపల్లి వినోద్ కుమార్‌ను కరీంనగర్ ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యమం టైమ్‌లో కేసీఆర్ వల్లెవేసిన స్లోగన్.. ‘మేము తప్పు చేస్తే రాళ్లతో మమ్మల్ని తరిమి తరిమి కొట్టండి’ అనే టైం ఇప్పుడు ఆసన్నమైందని పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ రీసీవర్స్ లిస్టులో అందరికన్నా పెద్ద అనకొండ అయిన బీజేపీ అని.. రెండో నంబర్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీలను నిలువు పాతర వేయాలని ప్రకటనలో కోరారు.