Thursday, September 11, 2025

ఆయారం.. గాయారం షురూ..

బూట్ల సూర్యప్రకాశ్ (మానకొండూర్ నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్)

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం రోజురోజుకు హీటెక్కుతోంది. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో అభ్యర్థులు ప్రచారంలో బిజీ అయ్యారు. ప్రధాన పార్టీలతో పాటు కొందరు స్వతంత్రంగా నామినేషన్ వేసిన వారు తమదైన శైలిలో జనాల్లోకి వెళ్తున్నారు. తమను గెలిపిస్తే ఏం చేస్తారో చెబుతున్నారు. ఈ నేఫథ్యంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్పీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఒక పార్టీలో ఉన్న వారు మరో పార్టీలోకి మారుతూ కండువా కప్పుకుంటున్నారు. ఉదయం ఒక నాయకుడు ఒక పార్టీలో కనిపించి.. సాయంత్రం అయ్యేసరికి మరో పార్టీలో దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది కండువాలు మార్చుకున్నారు. అయితే కొందరు రెండుకు మించి అన్నట్లు పార్టీలు మారుతున్నారు. ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఉంది.

కాంగ్రెస్ దూకుడు..

తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో గతంలో చాలా మంది చేరారు. అయితే వివిధ పదవలు ఆశించి రానివారు ఆ తరువాత బీజేపీలోకి మారారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడు పెంచుతుండడంతో ఆ పార్టీలోకి మారే వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో బీఆర్ఎస్ ను వీడేందుకు చాలా మంది రెడీగా ఉన్నారని, కొంత మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత ఎమ్మల్యేల సంగతి పక్కనబెడితే చోటా మోటా నాయకులు మాత్రం చాలా వరకు బీజేపీలోకి మారు.

బీఆర్ఎస్ నుంచి నేరుగా కాంగ్రెస్ లోకి..

ఆ తరువాత బీజేపీలో జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ మెల్లగా పుంజుకుంటోంది. జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటించడంతో రెండో పార్టీగా కాంగ్రెస్ ఎదిగిందని ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తీవ్రంగా పోరాడుతుండడంతో ఆపార్టీలోకి చేరికలు పెరిగాయి. బీఆర్ఎస్ నుంచి నేరుగా కాంగ్రెస్ లోకి.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారు తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నవారు చాలా మందే ఉన్నారు.

ఉదయం ఒక పార్టీ.. సాయంత్రం మరో పార్టీ..

అయితే చాలా మంది పదవులు, టిక్కెట్లు ఆశించి భంగపడ్డవారు చివరి నిమిషంలో పార్టీలు మారి సీటు దక్కించుకున్నారు. మరికొందరు ఆలస్యం కావడంతో భవిష్యత్ లో ఏదైనా పదవి వస్తుందనే ఆశతో మారుతున్నారు. కానీ కొంత మంది మాత్రం ఉదయం ఒక పార్టీ.. సాయంత్రం మరో పార్టీ.. అన్నట్లుగా మారుతున్నారు. కొన్ని రోజుల కిందట చాలా మంది చోటా నాయకులు ఉదయం బీఆర్ఎస్ లో కనిపించి, సాయంత్రం మరో పార్టీలో కనిపించిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి.

కరీంనగర్ లో అయారం.. గాయారం..

తెలంగాణలో కరీంనగర్ జిల్లా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పొలిటికల్ వెదర్ ఎప్పటికీ హీటెక్కిస్తుంది. ఈ జిల్లాలోని చాలా మంది నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారారు. ప్రస్తుతం ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉంది. ఈ జిల్లాలోని మానకొండూర్ నియోజవర్గం సైతం కీలకంగా మారింది. ఈ నియోజకవర్గంలోని ఓ మండలంలోని నాయకులు సైతం అయారం.. గాయారం.. అన్నట్లు గా మారుతున్నారు. బెజ్జంకి మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి మొన్నటి వరకు బీజేపీలో కొనసాగారు.. ఆ తరువాత బీఆర్ఎస్ కు మారారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగా వారం రోజుల కిందట ఇల్లంతకుంట మండలం లోని ఒక గ్రామం సర్పంచ్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సరిగ్గా వారం రోజులు గడిచిన తరువాత ఆ సర్పంచ్ దంపతులు తిరిగి బీ అర్ స్ లోకి వెళ్ళారు. ఇదేం చిత్రం అని పలువురు అంటున్నారు. పూటకో పార్టీ మారుస్తూ ఎప్పడు ఏ కండువా కప్పుకుంటున్నారో తెలియక అయోమంగా మారింది.

సరైన గుర్తింపు ఉంటుందా?

ఇలా పార్టీలు మారుతున్న వారిపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. పదే పదే పార్టీలు మారుతున్న వారికి ఎక్కడా సరైన గుర్తింపు ఉండదని అంటున్నారు. నిజంగా ప్రజా సేవ చేసే నాయకులు ఏ పార్టీలో ఉన్నా చేస్తారని చెబుతున్నారు. తమ సొంత అవసరాల కోసం పార్టీలు మారుతూ ప్రజలకు ఏదో చేస్తున్నామని చెబుతూ ప్రగల్భాలు పలకడం దేనికని విమర్శిస్తున్నారు. మరోవైపు పార్టీలతోనే తమ భవిష్యత్ ఉంటుందని ఆలోచించిన వారిని ఎప్పటికీ ప్రజలు ఆదరించని చెబుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page