Saturday, July 5, 2025

కాకా మనువడికే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్

  •  చివరి వరకు తప్పని ఉత్కంఠ
  •  వెంకటస్వామి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వంశీ
  •  పెద్దపల్లిలో హోరాహోరీ పోరు

(జనతాప్రతినిధి, కరీంనగర్)

ఎట్టకేలకు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్ అయ్యారు. మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి మనవడు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు కొడుకు వంశీకి టికెట్ కన్ఫాం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ తరఫున గడ్డం వంశీ, బీజేపీ తరఫున గోమాస శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. తాత వారసుడిగా వంశీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ ఎన్నిక వంశీ రాజకీయ చతురతకు, భవిష్యత్తుకు పునాది వేయనున్నది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిక

మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీ ఇచ్చారు. అంతకంటే ముందు బీజేపీలో పనిచేస్తూనే ఆ పార్టీలో ఈటల రాజేందర్ సహా పలువురితో వివేక్‌కు విభేదాలు ఉండడం వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డితో జరిగిన చర్చల సందర్భంలో తనకు చెన్నూరు నుంచి అసెంబ్లీ టికెట్, తనయుడు వంశీకి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. దీనికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముందుగా కుదురిన ఒప్పందం మేరకు రేవంత్ రెడ్డి తన హామీని నెరవేర్చుతూ వివేక్ తనయుడికి టికెట్ కేటాయించారు. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కోసం 29 మంది దరఖాస్తు చేసుకోగా సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకాని సహా మాజీ ఎంపీ గుణకుమారి, గజ్జలకాంతం, పెరిక శ్యామ్, రామిండ్ల రాధిక, పూట్ల వరప్రసాద్ లాంటివారు గట్టి పోటీ ఇచ్చారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకొని వివేక్ తనయుడికి టికెట్ ఇప్పించారు.

gaddam vamshi 1
gaddam vamshi 1

ఆ ఇద్దరు ఎదిరించిన దక్కించుకున్న టికెట్..

పది పదిహేనేళ్ల నుండి మంత్రి శ్రీధర్ బాబు మంచిర్యాల ఎమ్మెల్యేలతో డాక్టర్ వివేక్‌కు రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఆ ఇద్దరి కారణంగానే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండే వివేక్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌కు వచ్చారు. కాంగ్రెస్‌లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దీంతో అయినా మళ్లీ పార్టీ మారారు. అటు ఇటు వెళ్లి చివరికి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. అయినప్పటికీ పాత విభేదాలను దృష్టిలో ఉంచుకున్న ఆ ఇద్దరు ముఖ్య నాయకులు వివేక్ కొడుకు వంశీకి టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ ఇద్దరు తలచుకుంటే టికెట్ అనుమానమే అనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ వర్గాల వినిపించింది. కానీ, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాట నిలుపుకోవడానికి కోసం చేసిన ప్రయత్నం వల్లే గడ్డం వంశీకి టికెట్ వచ్చిందని అంటున్నారు.

ఇద్దరు గట్టి ప్రత్యర్థులు..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీపడుతున్న గడ్డం వంశీకి ఎదురుగా ఉన్న ఇద్దరు ప్రత్యర్ధులు గట్టి పోటీచేవారే బీఆర్ఎస్ నుండి పోటీపడుతున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్మిక వర్గాన్ని మెప్పించే నేర్పరి, స్వయంగా సింగరేణి కార్మిక నాయకుడు ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఇలా కొప్పుల ఈశ్వర్ తన ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు. ఇక బిజెపి నుండి తలపడుతున్న గోమాస శ్రీనివాస్ మాటల మాంత్రికుడు మోడీ గాలి, బాలా రామమందిరం.. ఇలా అనేక అంశాలతో తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వంశీకి ఉన్న బలం మాత్రం నియోజకవర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. అందులో ఇద్దరు ఒకరు తండ్రి మరొకరు పెద్దనాన్న. ఇక మిగిలిన ఐదుగురు సహకరిస్తే ఫలితం పెద్ద కష్టమేమీ కాదు అని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page