Pawan Kalyan :రాజమండ్రి : ఏపీలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి సంతరించుకుంది. ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, జనసేన ఇప్పటికే కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగా తాజాగా రాజమండ్రిలో కీలక భేటీ నిర్వహించారు. టీడీపీ కీలక నేత లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొన్నారు. ఇరు పార్టీలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఇందులో ఉన్నారు. ఇరు పార్టీలు కలిసి భవిష్యత్ తో చేయబోయే కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ , లోకేశ్ లు కలిసి మీడియాతో మాట్లాడారు. పపవన్ మాట్లాడుతూ రాష్ట్రానికి వైసీపీ అనే తెగులు పట్టుకుందని, అది పోవాలంటే టీడీపీ -జనసేన వ్యాక్సిన్ అవసరం అని అన్నారు. సాంకేతిక కారణాలతోనే చంద్రబాబును జైళ్లో పెట్టారని అన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే కలిసి పోటీ చేస్తున్నామని పవన్ అన్నారు. లోకేశ్ మాట్లాడుతూ బీసీలకు, ఎస్సీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఉద్యోగాలు లేక యువత పక్కరాష్ట్రాలకు వెళ్తున్నారని లోకేశ్ అన్నారు.