ఎఐసీ యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి రవీంధ్రనాథ్
నగరంలో ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ మహాసభలు
డివిజన్ కార్యవర్గం ఎన్నిక
కరీంనగర్-జనత న్యూస్
దేశంలో విభజన హామీలకు కాలం చెల్లిందని, గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల తీర్పే ఇందుకు నిదర్శనమన్నారు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ రవీంధ్రనాథ్. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో ఎంప్లాయీస్ యూనియన్ 28వ మహా సభ లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మతం ప్రాతిపదికన విభజించి అధికారంలోకి రావాలన్న రాజకీయాలకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.
ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పరిమితమైన మెజారిటీ ఇచ్చినప్పటికీ, సంస్కరణల పేరుతో ఎల్‌ఐసీ నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జూన్ త్రైమాసికానికి ఎల్‌ఐసి అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని గుర్తు చేశారు. ప్రజల విశ్వాసాన్ని మద్దతును కాపాడుకునేందుకు 74 సంవత్సరాలుగా తమ యూనియన్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా 13 ఎల్‌ఐసి బ్రాంచ్‌ల నుండి సుమారు 200 మంది సభ్యులు ఇందులో పాల్గొన్నారు. కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ జోనల్ అధ్యక్షులు సతీష్, సంయుక్త కార్యదర్శి తిరుపతయ్య, కోశాధికారి శ్రీనివాసన్, సికింద్రాబాద్ డివిజనల్ ప్రధాన కార్యదర్శి రఘు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు తీర్మాణాలు ఆమోదించారు.
నూతన కార్యవర్గం
ఐసిఈయు కరీంనగర్ డివిజన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు సభ్యులు. అధ్యక్షులుగా రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షులుగా సూర్యకళ, ప్రధాన కార్యదర్శిగా వామన్ రావు, సంయుక్త కార్యదర్శులుగా బసవేశ్వర్, అనుపమ, రాజేశం, కోశాదికారిగా శ్రీ లత లను ఎన్నుకున్నారు.