- ఏడ చూసిన అదే గుస గుస
- వచ్చే నెలలోనే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల అంటూ టాక్
- నేనంటే నేనంటూ ఇప్పటి నుంచే పోటీ కసరత్తు
- నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావాహులు
- ఫంక్షన్లకు వస్తూ – ప్రజలను కలుస్తూ
- పల్లెల్లో ప్రారంభమైన దావతుల పర్వం
- మళ్లీ బరిలో నిలిచేందుకు పాత సర్పంచ్ ల తహతహ
- ఎంత ఖర్చైనా పెడతామంటూ ఆశావాహులు
- పాత రిజర్వేషన్ల దిశగా రాష్ట్ర సర్కార్..?
కరీంనగర్/హన్మకొండ,జనత న్యూస్:పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ఇంకా రిజల్ట్ రానేలేదూ కానీ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పోరు ముచ్చట్లు పొంగుతున్నాయ్.. రచ్చబండ.. రాల చెట్టు కింద .. ఏడ చూసిన సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లు మల్లోచ్చే నెలలో పెడతారని గుసగుసలు గుప్పుమంటున్నాయ్. ఇక ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు గ్రామాల్లో నేనంటే నేను నిలబడుతానంటూ బుడ్డ బుడ్డ లీడర్లు రెడీ అవుతూ పంక్షన్లకు వస్తూ..ప్రజలను కలుస్తూనే పదిమంది ఉన్న కాడ ముచ్చట పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలకు, 88,862 వార్డులకు పంచాయతీ ఎన్నికలు జరగనుండగా ప్రభుత్వం ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని స్పీడ్ అఫ్ చేస్తోంది. సర్పంచ్,ఎంపీటీసీ ఎన్నికలను తొందరగానే నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండగా గ్రామాల్లోని ఆశావాహులు బడా లీడర్లను,ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే పోటీలో ఉన్నట్టు తన సన్నిహితులతో చెప్పుకుంటూ ఎంత ఖర్చయినా పర్వాలేదు పోటీలో ఉంటామని గెలిచి తీరుతామని ముచ్చటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చాలాచోట్ల కొత్త లీడర్లు పోటికి రెడీ అవుతుండగా, ఇంకొన్ని చోట్ల గతంలో సర్పంచిగా పనిచేసినోళ్లే మల్ల నిలబడేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొంతమంది దావతులిస్తూ కావలసిన వాళ్లకు సర్పంచ్ గా నిలబడుతున్నానని చెప్పుకుంటున్నారని వినికిడి.ఇక ఓటర్లైతే మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు సప్పగనే సాగినాయని పంచాయతీ ఎన్నికల వస్తేనే ఊళ్ళల్లో ఉషారు ఉంటుదని.. ఓటుకు వందో రెండు వందలో వస్తాయని ఆశపడుతూ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు.లీడర్ల ముచ్చట, ఓటర్ల ముచ్చట్లు అట్లూంటే చదువుకున్నోళ్లు, యువకులు దేశానికి పట్టకొమ్మలనే నానుడి. గ్రామ పంచాయతీలో పంచాయతీల అభివృద్ధి కోసం సదువుకున్నోళ్లు, ఊరికి పని చేసేటోళ్లను గెలిపియటానికి సిద్ధమవుతూ… ఓట్లకు నోట్లు తీసుకోకుండా ఊరికి పనికొచ్చే నాయకున్ని ఎన్నుకునేందుకు రెడీ అయ్యిండ్రు… మరి మీ ఊర్లో ఊరి కోసం ఉపయోగపడే నాయకున్ని ఎన్నుకుంటారు కదూ…
ఎన్నికలు సెప్టెంబర్,అక్టోబర్ లో ..?
స్థానికసంస్థల ఎన్నికలు సెప్టెంబర్ తరవాతనే జరగవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ పెంచేందుకు సవరణను అసెంబ్లీ అమోదానికి బీసీ కులగణన కు సుమారు 2,3 నెలల సమయం పడుతోంది.ఈ లోపు రైతు రుణమాఫీ తోపాటు ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే పనిలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది.ఈ లోపు పార్లమెంట్ ఎన్నికల పై విశ్లేషణ చేసి లోటుపాట్లను సవరించి పార్టీ ని బలోపేతం చేసి 33 జడ్పీ లు దక్కేలా మంత్రులను,ఎమ్మెల్యేలను సన్నద్ధం చేసేటట్టు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించేటట్టు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
జిల్లాల కుదింపు ప్రకటన ఉత్తదేనా..?
గత ప్రభుత్వం పాలన సౌలభ్యం పేరునా ఇష్టారీతిన 33 జిల్లాలను ఏర్పాటుచేసింది. పది ఏళ్ల అనంతరం రాష్ట్రంలో పరిపాలన బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను కుదించే యోజనలో ఉన్నట్టు ప్రకటించింది.జిల్లాల కుదింపు చేస్తారా?లేకా ప్రజలను మభ్య పెడుతూ ప్రకటన చేశారా?అని సందేహం ప్రజల్లో తలేత్తుతోంది.జిల్లాలను కుదించకుండా జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి పలితాలు వెలువరిస్తే యథావిధిగా 33 జిల్లాల జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.ఎన్నుకున్న అనంతరం జిల్లాల కుదింపు చేస్తే చైర్మన్లుగా ఎన్నికైన వారు అన్యాయానికి గురవుతారు.జిల్లాల కుదింపు చేపట్టకుండా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలకు వేళ్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగిపోయి భంగపాటు తప్పదనే ఉహగానాలు వినిపిస్తున్నాయి.ఎన్నికలేవైనా ప్రజల్లో సుస్థిర స్థానం నిలుపుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ రైతులకు, ప్రజలకిచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి బీసీ కుల గణన,జిల్లాల కుదింపు పక్రియ ప్రకటన చేపడితేనే మళ్లీ మనుగడ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.