Sunday, July 6, 2025

గులాబి తోటలో హస్తరేకలు

  • తెలంగాణ కోట పై ఎగిరిన కాంగ్రెస్ జెండా
  • బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఎన్నో…

తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి,ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అధికారం లోకి వచ్చిన కేసీఆర్ కు తగిలిన పెద్ద ఓటమి ఇది.జాతీయ రాజకీయాల్లోచక్రం తిప్పాలన్న వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత తగిలిన పెద్ద దెబ్బ ఇది. తన ఎత్తులు జిత్తులకు తిరుగులేదని అనుకున్న కేసీఆర్ పార్టీ ఓటమిచెందింది.గత దశాబ్ద కాలంగా తాను సాధించిన రాష్ట్రానికి తానే సీఎం గా వ్యవహరిచిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజాతీర్పుతో తనపదవికి రాజీనామా సమర్పించారు.రెండో దశ ఉద్యమ కాలం నుంచి ప్రతీ నోట కేసీఆర్ పేరు నలుదిశలా మారుమోగింది.రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి గా వ్యవహరించిన కేసీఆర్ పార్టీ ఒక్కసారిగా ఓటమి చెందటం వూహించని విషయంగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీనే తప్ప మరో పార్టీని గెలిపించని జిల్లాలో కూడా నేడు ఆ పార్టీ రెండు, మూడు స్థానాలతోనే సరి పెట్టుకోవలసి వచ్చింది.ఒక్క హైదరాబాద్(జీహెచ్ఎమ్సీ)పరిధిలో చాలా మెరుగైన ఫలితాలు సాధించటం ఆశ్చర్యం గా ఉంది. ..ఇలా ప్రజా క్షేత్రంలో కేసీఆర్ పార్టీ గ్రాఫ్ పడిపోవటానికి కారణాలు ఏమిటో విశ్లేషించుకుందాం…

2018న నమ్మిన ఫార్ములానే నమ్ముకొని 2023 ఎన్నికల బరిలోకి దిగారు కేసీఆర్.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించాక ప్రజలు ఎంతో ఆశించారు.ఆయనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.కానీ వారి ఆశలు ఆడియాసలే అయ్యాయి.నీటి వనరులు,విద్యుత్ సౌకర్యం మెరుగుదల చేసినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలు బెడిసి కొట్టాయి.అంతే కాకుండా పార్టీలో బంగారు తెలంగాణ (బీటీ) బ్యాచ్ ప్రభావం..అంటే డబ్బున్న వారి ప్రాబల్యం,కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రభావం బాగా పెరిగిపోయియింది.ఉద్యమకాలంలో పనిచేసిన వారికి సరైన ప్రాధాన్యత కూడా ఇవ్వలేదని విమర్శలు కూడా ఉన్నాయి.ఉద్యమ సమయంలో సహకరించిన ఉద్యోగ వర్గాలు,ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం తమకు ఏమీ చేయటం లేదనే అపవాదునికూడా కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొంది.టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పై నమ్మకం నానాటికి తగ్గిపోయింది.

పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు,వారి అనుచర గణం చేసిన భూ కబ్జాలు,వివిధ ప్రజావ్యతి రేకచర్యలు ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసాయి.30 నుంచి 40 సిట్టింగుల స్థానాలు మార్చుతారని భావించినప్పటికీ సిట్టింగులకే టికెట్లు ఇవ్వటంతో ప్రజా తీర్పు వారికి వ్యతిరేకంగా వచ్చిందని భావిస్తున్నారు.రైతు బంధు పధకం ప్రవేశ పెట్టినప్పటికీ కౌలు రైతులకు ఇవ్వక పోవడం ఆ పార్టీకి ఆశని పాతంగా మారింది.అలాగే వికలాంగుల పెన్షన్లు, డబుల్ బెడ్రూంలు,దళిత బంధు పధకాలను సరిగా అమలు చేయక పోవటంతో ప్రజలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు.మరో బలమైన కారణం ప్రభుత్వం పై యువకులు వ్యతిరేకంగా ఉండటం.సరైన విధానంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వక పోవడం,టీఎస్పీసీలో పేపర్ లీకులు జరగటం కేసీఆర్ ప్రభుత్వానికి తీవ్ర అపవాదులు తెచ్చి పెట్టింది.ఈ అంశాలను సరిగా డీల్ చేయటంలో బీఆర్ఎస్ నేతలు విఫలం చెందారు.మరో వైపు కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవటం కూడా పార్టీని తీవ్రంగా దెబ్బతీసినాయి.

మరో ముఖ్య కారణం ఎన్నోకోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడి గడ్డ ప్రాజెక్టు కుంగి పోవటంతో పార్టీకి తీవ్ర దెబ్బతగిలింది.రైతులకు ఉచిత కరెంట్,ధరణి వంటి విషయాలను సరిగా ప్రజలకు ప్రచారం చేయటం లోబీఆర్ఎస్ నేతలు భయపెట్టారు తప్పా..సరైన విషయాలను విప్పిచెప్పలేక పోయారు.కాంగ్రెస్ పార్టీ వాటిని అమలే చేయదని భయపెటారు.ఈ కారణాలతో బీఆర్ఎస్ అధికారంలోకి రాలేక పోయిందని పలువురి అంచనా. నేడు వూహించని విధం గా కాంగ్రెస్ అధికారంలో కి రావటం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

ఆశలన్నీ రేవంత్ పైనే….

ఎన్నో రాజకీయ సవాళ్ళను ఎదుర్కొని నేడు కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది.ఇప్పుడు అందరి కన్ను రేవంత్ రెడ్డి పై ఉంది.నాడు పీసీసీ చీఫ్ గా పనికి రాడన్న నేతలే నేడు ప్రశంసలు కురిపిస్తున్నారు.నిత్యం కీచులాడుకునే నేతలను అందరినీ ఒక్కతాటిగా నడిచేలా చేశాడు రేవంత్.సొంత పార్టీలో అందరినీ సమన్వయం చేస్తూ రాహుల్ జోడో యాత్ర సక్సస్ చేశారు.ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేశారు. అభ్యర్థుల ఎంపిక, బీఆర్ఎస్ పార్టీ ని ఇరకాటంలో పెట్టేలా దుందుడుకుగా విమర్శించడం..రోజుకు 3,4 సభల్లో మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిలా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేశారు రేవంత్ రెడ్డి.ఇక కాంగ్రెస్ అధిష్టానం నేతలను,తన తోటి నాయకులను సమన్వయం చేసుకుంటూ ప్రజల మనసులు ఎలా గెలుచుకుంటారో వేచి చూద్దాం…
                                                                                                                                     ఎస్.వి.రమణా చారి

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page