- కెసిఆర్ ఓడిరచాలన్న కసితో భంగపడ్డ నేత
- గజ్వెల్లో గెలుపోటములను లెక్కవేయడంలో విఫలం
(యాంసాని శివకుమార్ -జనతా న్యూస్)
కెసిఆర్‌పై వ్యతిరేకత ఉందని అంతా అన్నారు. ఈసారి తప్పకుండా ఓడిపోతారని అనుకున్నారు. గజ్వెల్లో కూడా ఓటమి ఖాయమన్న అంచనాలు వచ్చాయి. బిఆర్ఎస్ ఓటమి ఖాయమనుకున్న సమయంలో కామారెడ్డిలో కెసిఆర్ పోటీ కూడా వాదనలకు బలం చేకూర్చింది. ఇదే ఈటెల రాజేందర్‌ను అతి విశ్వాసంలోకి నెట్టింది. తను గెలుస్తున్న హుజరాబాద్తో పాటు గజ్వెల్లో పోటీ చేసి..కెసిఆర్‌ను ఓడిరచాలన్న పట్టుదలతో బరిలోకి దిగి బోల్తా కొట్టారు. ఒక్కచోట బోల్తా కొడితే బాగుండు. ఏకంగా రెండుచోట్లా ఓటమి కొనితెచ్చుకున్నారు. హుజూరాబాద్‌తో పాటు గజ్వెల్లో కూడా పోటీ చేయడమే ఆయన కొంప ముంచింది.
రాజకీయాల్లో విశ్వాసం ఉండాల్సిందే..తెగింపు కూడా అవసరమే. కానీ అతి విశ్వాసం పనికిరాదని తెలుసుకోవాలి. గజ్వెల్లో కెసిఆర్ ఓడిపోతారన్నదానికి ప్రాతిపపదిక ఏదీ లేదు. గాలివాటం వార్తలను పట్టుకుని అక్కడ పోటీ చేస్తానని దిగడం ఈటెల చేసిన పెద్ద తప్పుగానే భావించాలి. అందుకే హుజూరాబాద్ ప్రజలు కూడా అనుమానించారు. ఇక్కడా అక్కడా పోటీ చేయడాన్ని ప్రత్యర్థులు బాగా ప్రచారం చేశారు. తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. తనను గెలపించాలని కౌశిక్ రెడ్డి చేసిన అభ్యర్థన ప్రజల్లోకి వెళ్లింది. ఈటెల తన సొంత నియోజకవర్గంలో ఎక్కువగా దృష్టి పెట్టకుండా గజ్వెల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. దీంతో ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో తన సత్తాను చాటలేకపోయారు. హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ రెండోచోట్లా ఓడిపోయారు. గజ్వెల్లో పోటీ చేయాలన్న ఆలోచనకు రావడమే తప్పు. తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డ కెసిఆర్‌పై కసితీర్చుకోవాలన్న ఆతృతలో ఆయన సొంత నియోజకవర్గంలో కూడా అభాసు పాలయ్యారు. అమిత్ షా వచ్చి ప్రచారం చేసినా కలసిరాలేదు.
ఇలా ఉమ్మడి కరీంనరగ్ జిల్లాలో ఈటెలతో పాటు సీనియర్లు కూడా మట్టి కరిచారు. కరీంనగర్లో బండి సంజయ్, కోరుట్లలో ధర్మపురి అరవింద్, దుబ్బాకలో రఘునందన్ రావు కూడా ఓటమి పాలయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. 13 నియోజకవర్గాలకు గానూ ఎనిమిది స్థానాలను సొంతంచేసుకున్నది. మిగిలిన ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. బీజేపీ మాత్రం ఖాతా తెరువక పోగా.. ఆ పార్టీలో సీనియర్ నాయకులైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ ఓటమి పాలయ్యారు.
గెలిచిన వారిలో మాకునూరి సంజయ్ కుమార్, సంజయ్ కల్వకుంట్ల, కవ్వంపల్లి సత్యనారాయణ ముగ్గురూ వైద్యులే కాగా, ఈసారి ఎనిమిది మంది మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. కాగా, సిరిసిల్ల గడ్డపై నుంచి ఉప ఎన్నికను కలుపుకొని వరుసగా ఐదోసారి కేటీఆర్, కరీంనగర్ నుంచి వరుసగా నాలుగోసారి గంగుల కమలాకర్ జయకేతనం ఎగురవేశారు. కాగా, కరీంనగర్ అసెంబ్లీ ఫలితం చివరి వరకూ ఉత్కంఠ రేపినా.. చివరకు గంగులే విజయం సాధించారు.