Wednesday, July 2, 2025

నవంబర్‌ 3న సిరిసిల్లకు సీఎం రేవంత్‌ రెడ్డి..?

నేతన్నలకు వరాలు ప్రకటించే ఛాన్స్‌

యాజమాన్యాలు, అధికారులతో..
వేములవాడలో చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సమీక్ష

విద్యుత్‌ రాయితీ, యార్న్‌ డిపో, ఇతర సబ్సిడీలపై..
సిరిసిల్లలో కార్మిక సంఘాలతో ఈరవత్రిని చర్చలు

ఇప్పటికే చేనేత రుణమాఫీపై ఉన్నతాధికారులకు నివేదికలు

జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి
సిరిసిల్ల నేతన్నల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్‌ పెట్టారు. గత నెల 9న హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌లో ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది సర్కారు. ఇందులో భాగంగా మంగళవారం వేములవాడలో చేనేత జైళిశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్‌ యాజమాన్యాలతో పలు అంశాలపై చర్చలు జరిపారు. అటు సిరిసిల్లలోనూ తెలంగాణ మినరల్‌ డెవలాప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ ఈరవత్రిని అనిల్‌ కార్మిక సంఘాల ప్రతినిధులు, యాజమానులతోనూ పలు అంశాలపై సమాలోచనలు చేశారు. విద్యుత్‌ రాయితీ, యార్న్‌ డిపో, ఉపాధి తదితర అంశాలపై వారి నుండి సూచనలు స్వీకరించారు. వీటిపై సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు, సీఎం రేవంత్‌తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు చేనేత సహకార సంఘాల రుణమాఫీపై కూడా త్వరలో ప్రభుత్వం ప్రకటన చేయనున్నారు. ఇందుకు గాను నవంబర్‌ 3న సీఎం రేవంత్‌ రెడ్డి సిరిసిల్ల టూర్‌ ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వరాలు ప్రకటించే అవకాశాలున్నాయి.

నవంబర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి సిరిసిల్లకు రానున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. సిరిసిల్ల నేతన్నల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపేలా కార్యచరణ చేపడుతుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా వేములవాడలో చేనేత జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝ, టెస్కో ఎండి అశోక్‌ రావులతో పాటు సిరిసిల్ల యాజమాన్యాలతో పలు అంశాలపై చర్చలు జరిపారు. కాగా..సిరిసిల్లలోనూ మంగళవారం పవర్‌ లూమ్‌ యాజమానులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో పలు అంశాలపై సమావేశం నిర్వహించారు తెలంగాణ మినరల్‌ డెవలాప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ ఈరవత్రిని అనిల్‌. ఇందులో కీలక అంశాలపై చర్చించారు. ఇటు పద్మశాలి సంఘాల ప్రతినిధులతో, ఇటు సీఎం రేవంత్‌ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండే అనిల్‌..సిరిసిల్ల పరిశ్రమ సంక్షేమంపై సమాలోచనలు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది.
విద్యుత్‌ రాయితీ, యార్న్‌ డిపో, చీరల ఉత్పత్తిపై..
సిరిసిల్ల పవర్‌ లూమ్‌ పరిశ్రమను విద్యుత్‌ సమస్య వేదిస్తోంది. దీనికి పులిస్టాప్‌ పెట్టడంతో పాటు కర్ణాటక తరహాలో రాయితీలు ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. సిరిసిల్లలోనే నూలు డిపో ఏర్పాటు చేసి రాయితీ ద్వారా సరఫరా చేయాలని యజమానులు, ఆసాములు కోరుతున్నారు. మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేసే చీరల ఆర్డర్‌..ఆర్డీవన్‌, ఆర్డీ`2 స్కీమ్‌, వర్క్‌ టూ ఓనర్‌ అమలు..ఇలా అనేకమున్నా, ఇందులో కొన్నింటిని సిరిసిల్ల వేదికగా ప్రారంభించే అవకాశాలున్నాయి. వీటితో పాటు బీఆర్‌ఎస్‌ పాలనలో కార్మికులు జరిగిన అన్యాయాన్ని సభా వేదికపై వివరించే అవకాశాలున్నాయి.
చేనేత రుణమాఫీ అమలు..
సిరిసిల్ల సీఎం పర్యటనలోనే చేనేత కార్మికుల రుణమాఫీ చెక్కును రిలీజ్‌ చేసే అవకాశాలున్నాయి. గత నెల 9న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని చేనేత సహకార సంఘాల క్యాష్‌ క్రెడిట్‌ వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు అధికారులు. దీంతో పాటు కొంత మేరకు ఉన్న వ్యక్తిగత రుణాల వివరాలు కూడా రెండు రోజుల్లో నివేదించనున్నారు. 2017 నుండి 2024 వరకు ఆయా సంఘాలకు ఉన్న క్యాష్‌ క్రెడిట్‌ రుణాలు మాఫీ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 30 కోట్ల వరకు రుణాలు మాఫీ అయితే..ఇందులో కరీంనగర్‌ జిల్లాలోని 19 సొసైటీలకు రూ. 4.25 కోట్ల వరకు మాఫీ అయ్యే అవకాశం ఉంది. సభా వేదికపై సీఎం రుణవిముక్తి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.
చేనేత, పవర్‌ లూమ్‌ పరిశ్రమల దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులకు శాశ్వత ఉపాధి కలిగేలా కార్యచరణ చేపడుతోంది సర్కారు.చేనేత రంగంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యార్‌.. కార్మికుల సంక్షేమంపై అటు అధికారులు, ఇటు యజమానులతో సమాలోచనలు చేస్తున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page