పేదల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
బీఆర్‌ఎస్‌కు ప్రజల నుండి నో ఎంట్రీ బోర్డులు
కేంద్ర మంత్రి బండి సంజయ్..
కరీంనగర్-జనత న్యూస్
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్‌లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి లతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..హైడ్రా చేపట్టిన పనులకు తొలుత తాను కూడా సపోర్ట్ చేశానని, కాని పేదల నివాసాల జోలికి వస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలు, విల్లాలు, ఫాంహౌజ్ లను కూలిస్తే తాము సమర్థించామని, కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూలుస్తున్నారని, హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. అప్పుడు అక్రమ భవనాలకు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దేశం, సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే నని, 18 కోట్ల సభ్యత్వ నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన పార్టీ బీజేపీ అని కొనియాడారు. ఈసారి మరో 10 కోట్ల మందిని సభ్యులుగా చేర్చాలని హైకమాండ్ నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణలో 77 లక్షల మంది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారని, వాళ్లందరినీ బీజేపీ సభ్యలుగా చేర్చాలిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని, రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం లేదని, బిడ్డ జైలు నుంచి బయటకు రాగానే యాగం చేస్తున్నాడన్నారు. చేతనైతే వరదలవల్ల నష్టపోయిన వారి కోసం కేసీఆర్ యాగాలు చేయాలని సూచించారు. దేశం ఫస్ట్…పార్టీ నెక్స్ట్… వ్యక్తి లాస్ట్ అనే నినాదంతో పనిచేస్తున్న బీజేపీలో ప్రతి ఒక్కరూ చేరాల్సిన అవసరముందని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సభ్యత్వ నమోదులో కార్యకర్తలు ముందుండాలని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు.