హైదరాబాద్, జనతా న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు బాలన్న మర్డర్ కేసు మిస్టరీగా మారింది. ఓ వైపు నయీం కేసు రీఓపెన్ చేయాలని డిమాండ్లు వస్తున్న తరుణంలో బాలన్న హత్యకు గురికావడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొడుకు నిజంగానే డ్రగ్స్‌కి బానిసై బాలన్నను హత్య చేశాడా? లేక కొడుకుతో ఎవరైనా హత్య చేయించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాజీ నక్సలైట్ బాలన్న.. నయీం హయాంలో గ్యాంగ్ స్టర్ గా చెలామణి అయ్యాడు. నయీంని కలవాలంటే ఫస్ట్ బాలన్నను కలవాల్సిన పరిస్థితి ఉండేది. అలాగే నయీంకి సంబంధించిన ప్రతి విషయం బాలన్నకి తెలుసు. నయీం అక్రమాల్లో కీలక పాత్ర పోషించాడు బాలన్న. నయీంకి నమ్మినబంటుగా ఉంటూ బాగానే ఆస్తులు వెనకేసుకున్నట్లు సమాచారం. నయీం అక్రమాల దగ్గర్నుంచి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ బాలన్నకు తెలుసని అంటున్నారు. అయితే నయీం 2016లో చనిపోయిన తర్వాత మూడేళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బాలన్న ఆ తర్వాత బయటకొచ్చి చాలా సైలెంట్ అయిపోయాడు. తనకున్న వ్యాపారాలు చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఇటీవల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు కలిసి నయీం కేసును రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశాయి. గత ప్రభుత్వంలో నయీం కేసులో అవకతవకలు జరిగాయని నయీం అక్రమాస్తుల్నీ బయట పెట్టాలని, నయీంకి సహకరించిన వారిని కనిపెట్టాలని డిమాండ్ చేశారు. అలా నయీం డైరీ ఓపెన్ చేయాలంటూ పొలిటికల్ రచ్చ మొదలైందో లేదో బాలన్న చనిపోవడం పలు అనుమానాలకు కారణమవుతోంది. నయీం కేసు రీఓపెన్ చేస్తే ఫస్ట్ విచారించేది బాలన్ననే అని భావించిన కొందరు, ఆయన హత్యకు ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలన్న అప్రూవర్‌గా మారి తమ పేర్లు ఎక్కడ బయట పెడతాడోనని డ్రగ్స్‌కు బానిసైన కొడుకును పావుగా వాడుకుని మర్డర్ చేయించారా అన్న కోణాలు తెరపైకొస్తున్నాయి.