- కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి
- వ్యవసాయ రంగాన్ని ఆధునికరించి లాభసాటిగా మార్చాం
- దేశవ్యాప్తంగా టెక్స్టైల్ పార్కుల అభివృద్ధి
- పదేళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి
- మీరంతా ఓట్లేస్తేనే ఇదంతా సాధ్యమైంది
- దక్షిణ కాశి రాజన్నకు నా ప్రణామాలు
- తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోడీ
- ముందుగా రాజన్నను దర్శించుకున్న ప్రధాని
- ఆలయంలో ప్రత్యేక పూజలు
- ఆ తర్వాత బహిరంగ సభకు
- పెద్ద ఎత్తున తరలివచ్చిన బిజెపి శ్రేణులు
కరీంనగర్, జనతా న్యూస్: కాంగ్రెస్ ,బీఆర్ఎస్ పార్టీలు అవినీతిలో రెండు దొందు దొందే అని, కాంగ్రెస్ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో వెనుకబడిందని,బీఆర్ఎస్ తో తెలంగాణలో అభివృద్ధి సాధ్యం అనుకుంటే కుటుంబ పాలనకు తెరలేపారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజన్న సిరిసిల్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ముందుగా వేములవాడ రాజన్న దర్శించుకున్న ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించి రాజన్నను మనసారా వేడుకున్నారు. అనంతరం బహిరంగ సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకున్నారు. తనదైన శైలిలో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ దక్షిణ కాశీ భగవానుడు రాజరాజేశ్వరస్వామికి ప్రణామాలు అంటూ రాజరాజేశ్వరుని వేడుకొని మాటల తూటాలు పేల్చారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చాననీ, ఇప్పటికి మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయనీ, కాంగ్రెస్, ఇండీ కూటమికి ఓటమి తప్పదన్నారు. బిజెపి, ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజారిటీతో విజయం దిశగా ముందుకు దూసుకుపోతుందని, మిగిలిన 4 విడతల్లోనూ బిజెపి, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమై ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని వాక్యానించారు.కరీంనగర్ లోక్‌సభ స్థానంలో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయం అయిందని జోష్యం చెప్పిన ప్రధాని,ఇక్కడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజలెవరికీ తెలియదనీ, కరీంనగర్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని తెలిపారు. రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ ప్రభావం ఏమీ కనిపించడమే లేదని, తెలంగాణలో ప్రజలందరూ నా పదేళ్ల పాలనా తీరు చూసి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
మీ ఓటు వల్లే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్న ప్రధాని
ఆర్టికల్ 370 రద్దు చేసుకోవడంతో జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైందనీ తెలిపారు.
రక్షణరంగంలో ఆయుధాలు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే స్థాయిలో భారతదేశం నిలిచిందని,
మీరందరూ ఓటు వేసి గెలిపించడం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని ప్రధాని చెప్పుకొచ్చారు. సభకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా ! తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆర్థిక, వ్యవసాయ రంగాన్ని అణచివేసి సమస్యల వలయంగా మార్చిందని, పదేళ్ల ఎన్డీయే పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. వ్యవసాయాన్ని ఆధునికీకరించి లాభసాటిగా మార్చి రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్న ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది అని,నానో యూరియా, కిసాన్ సమ్మాన్ నిధితో రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు.దేశ వ్యాప్తంగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు తో పాటు ప్రతి ఇంటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వం పథకాలను చేరేలా పని చేస్తున్నామని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు వారి కుటుంబాలే ముఖ్యం అని, భారతీయ జనతా పార్టీ అంటే నేషన్ ఫస్ట్ పార్టీ. దేశమే ముఖ్యమని భావించే పార్టీ మాది అని కితాబిస్తూ కుటుంబం వల్ల.. కుటుంబం చేత.. కుటుంబం కోసం.. ఈ నినాదంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం పార్లమెంటు ఎన్నికల విలువ వచ్చిందని ప్రజలకు సూచన చేశారు.మే 13న కాంగ్రెస్, బీఆర్ఎస్ పాపాలకు బుద్ధి చెప్పాలంటే కరీంనగర్ నుంచి బండి సంజయ్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి నగేశ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి, మాకు మద్దతు తెలిపాలని ప్రధాని ప్రజలను కోరారు.