మంథని, జనతా న్యూస్ : సజావుగా నామినేషన్ల ప్రక్రియ జరిగే విధంగా సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు.శుక్రవారం మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, ప్రీ సర్టిఫికేషన్ డెస్క్, నామినేషన్ ఫారం మంజూరు డెస్క్ , కంప్యూటర్ డెస్క్ పరిశీలించిన కలెక్టర్ అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నామినేషన్ స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా కృషి చేయాలని అన్నారు.
రిటర్నింగ్ అధికారి కార్యాలయ 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ర్యాలీలు అనుమతించ రాదని, రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. అంతకుముందు మంథని రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సందర్శించి నామినేషన్ స్వీకరణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంథని రిటర్నింగ్ అధికారి హనుమాన్ నాయక్, ఆర్డీవో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి తూము రవీందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.