రసమయి హ్యాట్రిక్ సాధించేనా ??
Manakondur Assembly : కరీంనగర్ (జనతా బ్యూరో): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మానకొండూరు నియోజకవర్గం ప్రస్తుతం కొంతభాగం సిద్దిపేట జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం 2009 సంవత్సరం లో కొత్తగా ఏర్పడింది.అప్పటి నుంచి ఈ నియోజకవర్గాన్ని గమనిస్తున్న వారికిపలు ఆసక్తికర పరిణామాలు కనపడు తున్నాయి. కమలాపూర్,నేరేళ్ల,ఇందూర్తి,కరీంనగర్ నియోజ కవర్గాల్లోని కొన్ని గ్రామాలను కలిపి ప్రస్తుత మానకొండూరు నియోజకవర్గాన్ని రూపొందించారు.కులాల పరంగా ఎస్సీలు 26 శాతం,ఎస్టీ 3 శాతం,ముదిరాజులు 13 శాతం,మున్నూరు కాపు 9 శాతం,యాదవులు 12 శాతం,గౌడ్స్ 10 శాతం,ముస్లింలు 5 శాతం,రెడ్డి లు 4 శాతం వున్నారు.
ఈ నియోజక వర్గంలోని కొంత భాగంలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా కనపడేది.అయితే 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరేపల్లి మోహన్ విజయం సాధించారు.అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఒరుగంటి ఆనంద్ గట్టి పోటీ ఇచ్చారు.2012లో ఆరేపల్లి మోహన్ విప్ గా పనిచేశారు.
2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రసమయి బాలకిషన్ (88 997)కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరేపల్లి మోహన్ (38 088)పోటీ చేయగా రసమయి బాలకిషన్ గెలుపొందారు.2018లో రసమయి బాలకిషన్ ఆరేపల్లి మొహన్ పై ఘన విజయం సాధించారు.
ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో మానకొండూరు నియోజక వర్గంలో విజేత ఎవ్వరనేది ఆసక్తి నెలకొంది.కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆరేపల్లి మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజీపీ లో చేరిపోయారు.బీఆర్ఎస్ అభ్యర్తిగా మళ్లీ రసమయి బాలకిషన్ కే టికెట్ ఇవ్వడం తో ఆరేపల్లి మోహన్ ఆశలు నిరాశగా మారిపోయాయి.కాంగ్రెస్ పార్టీ కూడా డాక్టర్ కవ్వం పల్లి సత్యనారాయణ నే తమ అభ్యర్థిగా ప్రకటించడంతో తప్పని పరిస్థితి లో ఆరేపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీ లో చేరిపోయారు.ఎమ్మెల్యే అభ్యర్థి గా కమల నాధులు ఆయనను బరిలోకి దింపుతారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల వాతావరణం నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ మంచి వూపులో వున్నారు.గత కొన్ని నెలల నుంచి గ్రామ,గ్రామంలో ఉదయం నించే మార్నింగ్ వాక్ లు,ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో వున్నారు.కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ప్రజలను కలుసుకుంటూ సమస్యలపై ధ్వజమెత్తుతున్నారు.కాంగ్రెస్ క్యాడర్లో విశ్వాసాన్ని నింపుతున్నారు.భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకూ తమ అభ్య ర్తిని ప్రకటించలేదు.తాజాగా ఆరేపల్లి మోహన్ చేరడంతో ఆయననే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ ఆరేపల్లి మోహన్ ను బీజీపీ తమ అభ్యర్థిగా ప్రకటిస్తే అధికార పార్టీ అభ్యర్థికి అటు కాంగ్రెస్ నుంచి, ఇటు బీజీపీ నుంచి గట్టి పోటీ వుంటుందని చెప్పవచ్చు.కాంగ్రెస్ అభ్యర్థి కవ్వం పల్లి సత్యనారాయణ కు వ్యక్తి గతంగా కాకుండా మంచి డాక్టర్ గా కూడా నియోజక వర్గంలో పేరు ఉంది. నియోజకవర్గ ప్రజలతో పాటూ పార్టీ లోని పెద్దలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి.అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను బుజ్జగిస్తూ కవ్వంపల్లి తన వైపు కు తిప్పుకుంటున్నారు.
వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చు కోవాలని రంగం సిద్ధం చేస్తున్నారు.బీజీపీ అభ్యర్థి గా ఆరేపల్లి మోహన్ ను ప్రకటిస్తే అధికార పార్టీకి గెలుపు సుసాధ్యం కాకపోవచ్చు అనేది విశ్లేషకుల అంచనా.గతంలో ఎమ్మెల్యే గా పనిచేసిన అనుభవం తో పాటు ఆయనకు ప్రజలతో మంచి సంబందాలు ఉన్నాయి.గ్రామగ్రామాన ఆయనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి.ప్రజలకు దగ్గరగా వుంటాడనే ఇమేజ్ ఉంది.ప్రస్తుత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానికుడు కాదనే వాదన నియోజకవర్గ ప్రజల్లో బలంగా ఉంది.
నియోజకవర్గం లో ముఖ్యంగా రోడ్ల పరిస్థితిని అసలే పట్టించుకోలేదని విమర్శలు సర్వత్రా ఉన్నాయి.ఇసుక దందాలతో తన అనుచరులకు సంబంధాలు, డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపు,దళిత బంధు పంపిణీలో అసమానత చూపుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగ వర్గాలలో అసంతృప్తి,ప్రభుత్వ వ్యతిరేకత తో రసమయి హ్యాట్రిక్ సాధించటం ఈసారి అంత సులభంకాదనే ప్రచారం జరుగుతోంది.