కరీంనగర్, జనతా న్యూస్: ఈనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి వెల్లడించారు. పోలింగ్ స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సర్వం సిద్ధం చేశామని పేర్కొన్నారు.శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి తో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2194 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటిలో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. 17 లక్షల 97 వేల మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషుల కంటే మహిళలు 40,000 మంది అధికంగా ఉన్నారని వివరించారు. 42 వేల మంది దివ్యాంగులు ఉన్నారని, వయోవృద్ధులు 13200 మంది ఉన్నారని, వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక వీల్ చైర్, వయోవృద్ధులు దివ్యాంగులను తీసుకెళ్లేందుకు ఒక ఆటోను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు 10,200 మంది ఉండగా, ఇందులో 8,815 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 86.5% నమోదయిందని వివరించారు. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ) కింద నమోదు చేసుకున్న 6800 మంది ఉద్యోగులు పోలింగ్ రోజున ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, నోటాతో కలుపుకొని ఒకటి ఎక్స్ట్రా ఉంటుందని, ఈ మేరకు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడ ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా 21 ఎఫ్ ఎస్ టి, 14 ఎస్ఎస్టి టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 200 ఫిర్యాదులు వచ్చాయని, 144 ఫిర్యాదులను పరిష్కరించామని పేర్కొన్నారు. మొత్తం 215 రూట్లలో 216 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించామని, ఈవీఎంలను తీసుకెళ్లే వెహికల్స్ కు జిపిఎస్ అనుసంధానం ఉంటుందని తెలిపారు. ఇతర జిల్లాల వారు శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత పార్లమెంటు పరిధిలో ఉండరాదని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో కోడ్ ఉల్లంఘన పై 16 కేసులు నమోదు చేశామని వివరించారు. దాదాపు 8 కోట్ల 87 లక్షల నగదును పట్టుకున్నామని, రెండు కోట్ల 11 లక్షల మద్యం, నాలుగు కోట్ల 87 లక్షల గంజాయిని సీజ్ చేశామని పేర్కొన్నారు. ఇంటింటికి ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశామని, దాదాపు 97 శాతం ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. పోలింగ్ స్టేషన్లల్లో ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. కూలర్లు, షామియానా, త్రాగునీరు మెడికల్ టీము ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఓటర్లు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక క్యూ లైన్ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రచారం, సభలు, సమావేశాలు నిషేధమని స్పష్టం చేశారు. ఐదుగురికి మించకుండా ఇంటింటికి ప్రచారం చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు.
మద్యం షాపులు మూసివేయాలని, ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లు 12 రకాల ధ్రువీకరణ పత్రాల తో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తామని, దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. 13వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. 288 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ పరిధిలో పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే ఎన్నికల విధుల నిర్వహణపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఐదు మోడల్ పోలింగ్ స్టేషన్ల ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 76% పోలింగ్ స్టేషన్లల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్లమెంట్ పరిధిలో 5500 బ్యాలెట్ యూనిట్స్, 2743 కంట్రోల్ యూనిట్స్, 3077 వివి ప్యాట్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తానికి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కరీంనగర్, చొప్పదండికి సంబంధించి కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో ఉంటుందని, మానకొండూరుకు సంబంధించి కరీంనగర్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉంటుందని తెలిపారు. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి ఆయాచోట్లనే ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పారు.
పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం..
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి పేర్కొన్నారు పోలీస్ శాఖ తరఫున చేపట్టిన ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు. ఎన్నికల బందోబస్తుకు 2500 మంది పోలీసులను వినియోగిస్తున్నామని చెప్పారు. 54 స్పెషల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లకు పారా మిలటరీ సిబ్బందిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 1106 పోలింగ్ స్టేషన్లల్లో 106 రూట్లలో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్పెషల్ ఫోర్సు, స్ట్రైకింగ్ ఫోర్సును సీఐ, డీఎస్పి స్థాయి అధికారి పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఆదివారం నుంచి సోమవారం రాత్రి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లకు చేరేవరకు పోలీస్ శాఖ తరపున పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించామని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తమ శాఖ తరపున అప్రమత్తంగా ఉంటామని, ఎక్కడ ఏ ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రత మధ్య స్ట్రాంగ్ రూములకు తరలిస్తామని చెప్పారు.ఈ విలేకరుల సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి లక్ష్మణ్ కుమార్, ఏపీఆర్ఓ వీరాంజనేయులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.