Saturday, July 5, 2025

ఎల్‌ఎండీ ఆయకట్టు ప్రశ్నార్థకం !

ప్రస్తుత నిటి నిల్వ 5 టీఎంసీలు
తాగునీటికీ కట కటే..!
ఎస్‌ఆర్‌ఎస్‌పీ, మిడ్‌ మానేరు ప్రాజెక్టుల నుండి..
తరలింపుపై మీన మేషాలు
జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి
తెలంగాణలోని ఇతర జలాశయాలు నీటితో కళ కళ లాడుతుంటే..ఎల్‌ఎండీ మాత్రం నీళ్లు లేక వెల వెల బోతోంది. వర్షాకాలం రెండు మాసాలు గడిచినా..ఇప్పటి వరకు ఇందులోకి కనీసం ఒక టీఎంసి కూడా నీరు చేరలేదు. ఎల్లంపల్లి నుండి మిడ్‌ మానేరు ప్రాజెక్టులోకి..అక్కడి నుండి అన్నపూర్ణ రిజర్వాయర్‌ ద్వారా రంనాయక సాగర్‌కు తరలిస్తున్నారు. కాని..ఎల్‌ఎండీ లోకి మాత్రం నీటిని వదలడం లేదు. అటు ఎల్‌ఎండీ వట్టిపోయి, ఇటు చెరువులు, కుంటలు నిండక పోవడంతో..కరీంనగర్‌ జిల్లాలో వానాకాలం పంటల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎస్‌ఆర్‌ఎస్‌పీ, మిడ్‌ మానేరు ప్రాజెక్టుల నుండి ఎల్‌ఎండీ లోకి నీటి తరలింపు ఉంటుందా..లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయడం లేదు.

వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ సీజన్‌లో ఆలస్యంగా పంటల సాగు ప్రారంభించారు రైతులు. గత యేసంగి చివరి దశలో పంటలకు సాగు నీరందక ఎండిపోయి రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుత వర్షాకాలంలోనూ పంటలకు నీటి సరఫరాపై ప్రభుత్వం నుండి స్ఫష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం ఎల్‌ఎండీలో నీటి నిల్వలు ఏ మాత్రం పెరగక పోవడంతో పాటు ఇతర రిజర్వాయర్ల నుండి నీటి విడుదల చేయక పోవడంతో కరీంనగర్‌ జిల్లాలోని తాగు, సాగు నీటి అవసరాలపై ఆందోళన వ్యక్త మౌతోంది.
ఎల్‌ఎండీ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 5.400 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. వర్షాలు సమృద్దిగా లేక పోవడంతో పాటు మోయ తుమ్మెద వాగు నుండి ఇన్‌ఫ్లో లేక పోవడంతో ఎల్‌ఎండీలో నీటి మట్టం పెరగలేదు. దీంతో కరీంనగర్‌కు తాగు నీటి సమస్యలూ తప్పడం లేదు. కనీసం పది టీఎంసీల నీటి నిల్వ ఉంటేనే ఇక్కడి ప్రజలకు డైలీ వాటర్‌ సప్లై చేసే పరిస్థితి ఉంటుంది. గత ఐదు నెల లకు పైగా నగర వాసులు తాగు నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అనేక డివిజన్లల్లో ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా తాగు నీటి సరఫరా చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా లోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గాయిత్రి పంపుల ద్వారా ఇప్పటి వరకు 12 టీఎంసీల నీటిని మిడ్‌ మానేరులోకి ఎత్తి పోశారు. దీంతో మిడ్‌ మానేరులో ప్రస్తుతం 17 టీఎంసీలకు నీరు చేరింది. ఇక్కడి నుండి పదో ప్యాకేజీ ద్వారా 6, 400 క్యూసెక్కుల నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు, అందులో నుండి 3, 400 క్యూసెక్కుల నీటిని రంగనాయక సాగర్‌కు ఎత్తి పోస్తున్నారు. వీటి ద్వారా కొంత మేరకు ఆయా జలాశయాలు నీటితో కళ కళ లాడుతున్నాయి. కాని..ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ లోకి నీటి విడుదల చేయక పోవడంతో..ఈ ప్రాజెక్టు ఆధారపడ్డ రైతుల్లో ఆందోళన నెలకొంది.
శ్రీ రాంసాగర్‌ ప్రాజెక్టు నుండి కాకతీయ కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటి మాత్రమే విడుదల చేసింది ప్రభుత్వం. కాకతీయ కాలువకు పలు చోట్ల గండ్లు ఎర్పడడంతో పాటు నిజామాబాద్‌ జిల్లా నుండి జగిత్యాల వరకు ఆ నీరు చేరడం కష్టంగా మారింది. ఎటొచ్చి.. కరీంనగర్‌ జిల్లా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎల్‌ఎండీలోకి నీటి సరఫరాపై ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఏ మేరకు ఒత్తిడి తీసుక వస్తారనేది వేచి చూడాలి.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page