- సీతక్క అలియాస్ అనసూయ…రియల్ లైఫ్ స్టోరీ..
(YAMSANI SHIVA KUMAR, EDITOR)
తుపాకీ గొట్టం ద్వారానే పేదల బతుకులు మారతాయని టీనేజీలో ఉండగా అనుకున్నారు. తుపాకీ చేత పట్టి అడవి బాట పట్టారు. పోలీసులతో పోరాడి.. చావు అంచుల్లోకి వెళ్లి.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఇంత కష్టపడ్డా సమాజం మారలేదని బాధ పడుతూ ఇంట్లో కూర్చోలేదు. తుపాకి గొట్టం ద్వారా కాదు రాజ్యాధికారం ద్వారా అయినా అనుకున్నది సాధిద్దామనుకున్నారు. రాజకీయాల్లోకి దిగారు.. ఎమ్మెల్యేగా పోటీ చేశారు.అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. అయినా.. రెండోసారి ప్రయత్నించి గెలిచారు. మార్పు చూపించారు. మూడోసారి ఓడిపోయినా.. పట్టు వీడకుండా మళ్లీ పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి.. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవికి హాట్ ఫేవరెట్ అయ్యారు. ఆ ధీర వనిత మరెవరో కాదు. ధనసరి అనసూయ అలియాస్ సీతక్క . తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెల్లెలిగా ప్రాచుర్యం పొందిన సీతక్క రాజకీయ జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే.
తుపాకీ చేతబట్టి అడవి బాట
విప్లవాల పురిటి గడ్డ.. ఆదివాసుల ఖిల్లాగా పేరొందిన ములుగు అసెంబ్లీ నియోజక వర్గం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే విస్తీర్ణంలో అతి పెద్దది. విప్లవ పార్టీలకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందిన ములుగు.. దట్టమైన అభయారణ్యాలతో ప్రకృతి రమణీయతకు, పర్యాటకానికి చిరునామాగా ఉంది. 75 శాతం గ్రామాలు అటవీ ప్రాంతంతో ముడిపడి ఉండటంతో పదేళ్ల క్రితం వరకూ మావోయిస్టులతో పాటు జనశక్తి, ప్రజా ప్రతిఘటన, న్యూ డెమోక్రసీ పార్టీలకు స్థావరాలుగా ఉండేవి. జనశక్తి విప్లవ సంస్థ నుంచి వచ్చిన నాయకురాలే సీతక్క. పదో తరగతిలో ఉన్నప్పుడే జనశక్తిలో చేరి.. తుపాకీ చేతబట్టి అడవి బాట పట్టారు.. 15 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం గడిపారు. భూస్వాములు, పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు.
ఎన్టీఆర్ పిలుపు మేరకు..
జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళ కమాండర్‌గా పని చేశారు. అయితే.. నక్సలైటు మార్గంలోనూ తాను ఆశించిన మార్పు రాలేదని గ్రహించిన సీతక్క.. రాజ్య దోపిడీని, దుర్మార్గాన్ని, పాలకుల కిరాతకాన్ని ఆపలేకపోయామని భావించారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు పోరుబాట వదిలి ప్రజా పోరాటాల ద్వారా సమాజంలో మార్పు తేవాలన్న లక్ష్యంతో పోలీసులకు లొంగిపోయారు. అజ్ఞాత జీవితానికి గుడ్ బై చెప్పి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 2001లో హైదరాబాద్ వచ్చి.. ఎల్‌ఎల్‌బీ చేశారు. తర్వాత ప్రజా విధానం, పాలనపై ఆసక్తి ఏర్పడటంతో సామాజిక సేవలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె అంకితభావాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు.. సీతక్కకు టికెట్ ఇచ్చారు. దీంతో 2004లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఆమె కాంగ్రెస్‌కు చెందిన పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు.
భారీ మెజారిటీతో గెలుపు…
ఆ తర్వాత కూడా ప్రజా పోరాటాల్లోనే కొనసాగుతూ.. 2009లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున మళ్లీ పోటీ చేసిన సీతక్క.. ఈసారి పొదెం వీరయ్యను ఓడించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఈ అడవి బిడ్డ.. చట్ట సభలను వేదికగా చేసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించారు. అయితే.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో మూడోసారి టీడీపీ తరఫున పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన సీతక్క.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్‌ను 22 వేల 671 ఓట్ల మెజారిటీతో ఓడించారు. గతేడాది కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బడెం నాగజ్యోతిపై ఏకంగా 33 వేల 700 మెజార్టీతో ఘన విజయం సాధించారు.
గుట్టలను సైతం లెక్క చేయకుండా..
ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అడవులను, గుట్టలను సైతం లెక్క చేయకుండా.. ప్రజల వద్దకెళ్లి వాళ్ల కష్టాలను తీర్చారు సీతక్క. కరోనా సమయంలో అటవీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు మంత్రులు, అధికారులు సైతం భయపడ్డారు. సీతక్క మాత్రం బియ్యం బస్తాలను తలపై పెట్టుకొని తన అనుచరులతో కలిసి.. అడవుల్లోని ప్రజల వద్దకు కాలి నడకన వెళ్లి.. వాళ్ల ఆకలి బాధలు తీర్చారు. దీంతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయానికి ఒంటరిగా కష్టపడిన రేవంత్ రెడ్డి.. సీతక్కను సోదరిగా భావిస్తారు. తన పాదయాత్రను సీతక్క నియోజక వర్గం నుంచే ప్రారంభించి.. సోదరి సెంటిమెంట్‌కు అద్దం పట్టారు రేవంత్. ఇప్పుడు ఏకంగా తెలంగాణ డిప్యూటీ సీఎం పోస్ట్ సైతం వెతుక్కుంటూ సీతక్క వద్దకొస్తోంది.