Friday, July 4, 2025

పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేతలు

  •  డబ్బుల మూటలు సిద్ధం చేస్తున్న ఖద్దరు చొక్కాలు!
  •  ఎన్నికల్లో పోటీ ఆషామాషి కాదు..తడిసి మోపెడవుతున్న ఖర్చులు..
  •  సన్నద్ధమవుతున్న ఆశావహులు

(కరీంనగర్​/ హుజురాబాద్,జనతా న్యూస్​)
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలకు కసరత్తు ప్రారంభించనుంది.మూడు,నాలుగు నెలల్లో గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మున్సిపల్ తో పాటు సింగిల్ విండో ఎన్నికలు కూడా జరగనున్నాయి. మొదట గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసి పాలనను ప్రత్యేక అధికారులు నిర్వహిస్తున్నారు. అలాగే ఎంపీటీసీ, జడ్పిటిసిల పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీల నేతల దృష్టి స్థానిక ఎన్నికలపై పడుతోంది. గ్రామస్థాయి నేతలు సర్పంచ్ ఎంపీటీసీ పదవుల కోసం సన్నద్ధమవుతున్నారు. గ్రామస్థాయి నేతలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

ఎన్నికల్లో పోటీ ఆషామాషి కాదు..తడిసి మోపెడవుతున్న ఖర్చులు..

రాజకీయ మోజు ఎందరో జీవితాలను అతలాకుతలం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకుడి పరిస్థితి ఏమో కానీ, గ్రామ,మండల,జిల్లా స్థాయిలో రాజకీయం చేసే నాయకుల ఖర్చులు తడిసి మోపెడౌతున్నాయి. సర్పంచ్,ఎంపీటీసీ,ఎంపీపీ, జడ్పీటీసీ,సింగిల్ విండో చైర్మన్, నామినేటెడ్ పదవులు అనుభవించే వారు సైతం సంపాదించేది దేవుడెరుగు అడ్డగోలు ఖర్చులు గుదిబండలా మారుతున్నాయి.అధికార హోదా,దర్పం కోసం చేస్తున్న ఖర్చులు పెరిగి అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. పదవుల మీద వ్యామోహంతో ఎన్నికల్లో తలపడి కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఈ సందర్భంగా సంసార జీవితాలు అతలాకుతలమైన పట్టించుకోకుండా రాజకీయంలో ముందుకే వెళ్లాల్సిన పరిస్థితులు కొందరికి ఏర్పడుతున్నాయి. ఎన్నికల్లో ఓడిన వారు పెట్టిన ఖర్చు వెనక్కి రాక నష్టపోతే, గెలిచిన వారు హోదా తగ్గకుండా చేసే ఖర్చులతో ఆర్థికంగా నష్టపోతున్నారు.

సర్పంచ్ లకు గ్రామాల్లో హోదాతో పాటు గౌరవం కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరూ సర్పంచ్ సాబ్ అని సంబోధిస్తారు. తదనంతరం కూడా సర్పంచిగా పనిచేశారని ఎప్పుడు పేరు ఉంటుంది. ప్రభుత్వ నుండి కూడా గ్రామపంచాయతీలకు నిధులు వస్తుండడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వీలుంటుంది. ఆర్థిక సంఘం నిధులతో పాటు వివిధ రకాల గ్రాంట్లు గ్రామపంచాయతీలకు వస్తున్నాయి. గ్రామంలో ప్రతీ కార్యక్రమం సర్పంచ్ ద్వారానే జరుగుతుంది. అందుకే ఎలాగైనా ఈసారి సర్పంచ్ కావాలని చాలామంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. అలాగే ఎంపీటీసీ పరిధిలోను ఒకటి లేదా రెండు గ్రామాలు ఉంటాయి. జడ్పిటిసికి మండల పరిధి ఉంటుంది. జిల్లా పరిషత్ సమావేశాల్లో జడ్పిటిసిలే పాల్గొంటారు. మండల పరిషత్ సమావేశాల్లో ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొంటారు. ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ లకు ప్రతి సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం ఉంటుంది. ఏ అధికారిక కార్యక్రమం అనధికారిక కార్యక్రమాలు జరిగినా వీరిని ఆహ్వానించడం ఆనవాయితీ. తమ పలుకుబడితో తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్లో గ్రామస్తుల పనులు చక్కబెడతారు. దీంతో సహజంగానే ఈ పదవి ఎలాగైనా సంపాదించాలనే ఉత్సాహం పలువురిలో కనిపిస్తోంది. అయితే ఈ పదవులను దక్కించుకోవడం అంత ఈజీ వ్యవహారం కాదు. ఎందుకు ప్రజల్లో మంచి పేరు ఉండడంతో పాటు.. వ్యూహాలు ఎత్తుగడలు ఉండాలి. దీనికి తోడు డబ్బు ముఖ్య భూమిక పోషిస్తుంది. కాగా అవసరమైతే రూ.50 లక్షల నుండి కోటి రూపాయలైనా పెట్టేందుకు.. పదవులు సాధించేందుకు.. పలువురు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లోను చాలా చోట్ల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు రూ. 20 నుండి రూ. 50 లక్షల వరకు ఖర్చు చేశారు. జడ్పిటిసిల ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. కొన్ని గ్రామాల్లో రూ. 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు కూడా సర్పంచ్ పదవి కోసం ఖర్చు పెట్టారంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే సర్పంచ్ గా పోటీ చేసేందుకు పార్టీల బీఫారం అవసరం లేకున్నా.. ప్రధాన పార్టీల మద్దతు ఉండాలి.ఎంపీటీసీ,జెడ్పీటీసీ పోటికి పార్టీ బీఫారం కోసం టికెట్లు ఆశిస్తున్న వారు ఇప్పటినుండే ఆయా పార్టీల నేతలను,ఇంచార్జీలను కాక పడుతున్నారు.తాజా మాజీ సర్పంచులు, సిట్టింగ్ ఎంపీటీసీలు,జెడ్పీటీసీలు తిరిగి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మళ్లీ వీరికి పార్టీలు మద్దతు ఇస్తాయా?బీఫారాలు ఇస్తాయా? అనేది తేలాల్సి ఉంది.టికెట్ దక్కని కొందరు చాలెంజ్ గా తీసుకొని రెబెల్స్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంటారు. ఆయా పార్టీల నుండి టికెట్లు ఆశిస్తున్న ఔత్సాహికులను బుజ్జగించి టికెట్లు ఇవ్వడం కూడా నియోజకవర్గ ఇంచార్జీలకు తలనొప్పి వ్యవహారమే. స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మందిని గెలిపించుకొని తమ సత్తా నిరూపించుకోవడం కూడా నియోజకవర్గ పార్టీ ఇంచార్జీలకు సవాలే.గడచిన పదేళ్ల కాలంలో కొందరు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా సంపాదించారు.మరికొందరు ఎన్నారైల తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా బలపడ్డారు.వీరు సర్పంచులుగా,ఎంపీటీసీలుగా పోటీ చేయడానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకడమని బహిరంగంగా చెప్తున్నారు. గత ఎన్నికల్లోనే ఒక ఓటుకు సుమారు రూ. వెయ్యి నుండి రూ.5 వేల వరకు ఖర్చు పెట్టారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా గెలుపు గుర్రాల కోసం నియోజకవర్గ ఇన్చార్జిలు అన్వేషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో డబ్బులే ముఖ్యమైనందున డబ్బులు లేనిదే పోటీకి ముందుకు రావద్దని కుండ బద్దలు కొడుతున్నారు. ఏది ఏమైనా మరి కొద్ది రోజుల్లో స్థానిక సమరం ప్రారంభం కానుంది. ఇందుకోసం అస్త్ర శాస్త్రాలను రాజకీయ పార్టీలు, ఆశావహులు సిద్ధం చేసుకుంటున్నారు.

రాజకీయమంటే..ఫ్యాషన్ గా మారిన వైనం

వాస్తవంగా రాజకీయం అంటే సేవా దృక్పథం. క్రమంగా రాజకీయం ఒక ఫ్యాషన్ గా మారి కోట్ల సంపాదనకు పదవి కేంద్రబిందువుగా ఉందనే భ్రమలో గ్రామీణ నాయకులు,యువకులు మరికొందరు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. వాస్తవంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిస్తే కొంత ఆర్థిక అధికారం ఉంటున్నప్పటికీ, లక్షల, కోట్లు మిగిలించుకునే పరిస్థితులు ఇక్కడేమి ఉండవు. ఎంపీటీసీ పదవి అంటావా మండల స్థాయిలో ఎంపీపీని ఎన్నుకునేందుకు అవసరమైన సంఖ్యకు మాత్రమే ఉపయోగపడి ప్రత్యేకాధికారాలంటూ ఏమి ఉండని పదవి ఎంపీటీసీ.పంచాయతీకి పన్నుల ద్వారా, రాష్ట్ర గ్రాంట్ ల ద్వారా ఏడాదికి వచ్చే నిధులు రూ,2 లక్షల నుండి రూ,5 లక్షలకు మించవు. ఈ నిధులన్నీ కూడా ప్రత్యేక నిబంధనల ద్వారానే ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఎన్నికైన సర్పంచ్ ఇష్టప్రకారమేమీ ఖర్చు చేసే అవకాశం ఉండదు. పదవీ కాంక్ష కోసం ఒక పంచాయతీకి ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా వచ్చే రూ,20,30 లక్షల నిధుల కంటే ఎన్నికల కోసం అభ్యర్థి చేసే ఖర్చు మాత్రం రూ,50 లక్షల వరకు ఉంటుందంటే రాజకీయాలు మనిషిని ఆర్థికంగా ఏ స్థాయికి దిగజారుస్తాయో అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.

ఓటరు మార్పు..ప్రజాస్వామ్యానికి విలువ..

రాజకీయాల్లో పోటీ చేసే నాయకులతో పాటు వారికి ఓటు వేసే ఓటరు ఆలోచనా విధానం కూడా మారినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. తాజాగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు వస్తాయనే ప్రచారం జోరందుకుంది. ఏ ఒక్కరి నోట్లో చూసినా సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎవరు ఎంత ఖర్చు పెడతారో అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఓటుకు నోటు ఆశించకుండా అభివృద్ధి కోసం ఓటు వేస్తామని ఓటరు, తాను గెలిచేందుకు ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురిచేయనని నాయకుడు ప్రతిజ్ఞతో ఎన్నికల కార్యక్షేత్రం లోకి అడుగు పెట్టినప్పుడే అభివృద్ధి పరుగులు తీస్తుంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page