Wednesday, July 2, 2025

లడ్డూల్లో నాణ్యతెంత..?

భక్తులకు భరోస ఇవ్వని ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు
స్వీట్స్‌, పండ్లు, అహార పదార్థాలపై తనిఖీలు కరువు
ఏఎఫ్‌సీ ఉన్నా ప్రయోజనాలు సున్నా..

జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి

తిరుమల తిరుపతి లడ్డు నాణ్యతపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు అలెర్ట్‌ అయ్యాయి. లడ్డు తయారీలో నాణ్యమైన పదార్ధాలు వినియోగించాలని ఆయా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు సైతం తమ తమ పరిధిలోని ఆలయాల్లోని అడ్డుల షాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపి నాణ్యతపై స్ఫష్టత ఇచ్చి భక్తుల్లో భరోస ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లోని అడ్డుల్లోని నాణ్యతపై సబంధిత ఫుడ్‌ స్టేఫ్టీ అధికారుల నుండి స్పష్టమైన ప్రకటనేదీ రాక పోవడం ఆందోళన కల్గిస్తోంది.

తిరుమలలోని లడ్డుపై అనేక ఆరోపనలు రేకెత్తిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు దేవాలయాల్లోని భక్తులకు ఇచ్చే లడ్డులోని నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. వేములవాడ రాజన్న ఆలయంలో గతంలో ఏసీబీ అధికారుల తనఖీలో పలు లోపాలు గుర్తించిన నేపథ్యంలో సరుకుల వినియోగంపై ఈవో చేపట్టిన విచారణపై కూడా స్పష్టత లేదు. వీటిపై ఎప్పటికప్పుడు ఫుడ్‌ సేఫ్టీ అధికారి పర్యవేక్షించాల్సి ఉండగా..ఆలయాల్లోని పదార్ధాలపై తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేవు. సాధారణంగా నెయ్యిలో 0.3 శాతంకు మించి మాయిశ్చర్‌ ఉండరాదని, ఒకవేళ ఉంటే కల్తీగా భావించాల్సి ఉంటుందని ఓ రిటైర్డ్‌ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ జనత న్యూస్‌కు వివరించారు. అయితే..జిల్లాలోని నెయ్యి ఉత్పత్తి కంపెనీ, ఇతర దుకాణాల్లోని నెయ్యి షాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపిన దాఖలాలేవీ ఇప్పటి వరకు లేవు. గతంతో కరీంనగర్‌లో జంతువుల వ్యర్థాలతో తయారు చేసిన డాల్డాను తరలిస్తుండగా 20 టిన్నులను వన్‌టౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. అయినప్పటికీ ఫుడ్‌ సేఫ్టీ అధికారుల్లో కదలికలు రాక పోవడం ఆందోళన కల్గిస్తుంది.
స్వీట్స్‌, పండ్లు, అహార పదార్థాలపై తనిఖీలు కరువు..
కరీంనగర్‌ జిల్లాలోని షాపుల్లోని స్వీట్స్‌ తయారీలో మోతాదుకు మించి ఫుడ్‌ కలర్స్‌ కలుపుతున్నట్లు సమాచారం. గతంలో సేకరించిన షాంపిల్స్‌లోని రిపోర్ట్స్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కిలో ముడి సరుకులో 0.02 గ్రాము ఫుడ్‌ కలర్‌ మాత్రమే కలుపాలనే నిబంధన ఉంది. లడ్డు, బిర్యానీ, చెగోడి తదితర పదార్థాల తయారీలో అంతకు మించి ఫుడ్‌ కలర్స్‌ వినియోగిస్తున్నట్లు చూస్తేనే తెలుస్తుంది. దీనివల్ల క్యాన్సర్‌, ఇతర గ్యాస్ట్రో సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక..అరటి పండ్లలో ఇథోపాన్‌ ఫెస్టిసైడ్‌, ఆపిల్‌ పై ప్యారపిన్‌, సపోట, దానిమ్మలో కార్భడ్‌ రసాయణ అవశేషాలుంటున్నాయి.
నామ మాత్రంగా ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసు..
అహార కల్తీ నిరోదానికి రాష్ట్ర పరిధిలో ఫుడ్‌ సేఫ్టీ ప్రత్యేక విభాగం ఉంటుంది. హైదరాబాద్‌లో కమీషనర్‌, డైరెక్టర్‌, రీజనల్‌లో అసిస్టెంట్‌ ఫుడ్‌ సేఫ్టీ కంట్రోలర్‌, గెజిటెడ్‌ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఉన్నారు. వీరందరూ ఎక్కడుంటారు..? ఏం చేస్తారనేది చిదంబర రహస్యం. కరీంనగర్‌కు రెండు రోజుల క్రితమే అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌గా బాబూజి నియామకం అయినట్లు తెలిసింది. ఆయనతో పాటు గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ నాయక్‌ ఇంఛార్జిగా ఉన్నారు. ఈయనపై అనేక ఆరోపనలున్నాయి. నల్గొండలో తమకు సహరించలేదని విజిలెన్స్‌ అధికారులు సైతం ఈయనపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇక కరీంగర్‌ ఫుల్‌టైమ్‌ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ సెలవుపై వెళ్లడంతో సిరిసిల్ల జిల్లా ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌కు ఇంఛారి బాధ్యతలు అప్పగించారు. వీరు షాపింల్స్‌ ఎక్కడ సేకరిస్తున్నారు..రిపోర్టులు ఏం వచ్చాయి..? జిల్లా అదనపు కలెక్టర్‌కు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఫైళ్లు పెట్టి..ఫైన్లు, లైసెన్సులు ఎన్ని రద్దు చేశారు..? కోర్టుల్లో ఎన్ని కేసులు పుటప్‌ చేశారనేది రహస్యమే. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టి, ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page