- వీణవంకకు చేరుకున్న గులాబీ దళపతి కేసీఆర్!
- ఘన స్వాగతం పలికిన యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
- నేడు వీణవంకలో గులాబీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం
KowshikReddy: హుజురాబాద్, జనత న్యూస్: బీ ఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం రాత్రి హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంకకు చేరుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేసీఆర్ కు ఘనస్వాగతం పలికారు. శనివారం రాత్రి కేసీఆర్ కౌశిక్ నివాసంలో బస చేస్తారు. ఆదివారం ఉదయం వీణవంక లో నియోజకవర్గస్థాయి గులాబీ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ పాల్గొంటారు. ఇందుకోసం కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసారు. కేసీఆర్ రాక సందర్బంగా గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. నిజానికి ఈ నెల 2 న కేసీఆర్ బస్సు యాత్ర జమ్మికుంట కు చేరుకోవాల్సి ఉంది. జమ్మికుంట లో రోడ్ షో లో కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. కానీ ఎన్నికల సంఘం కేసీఆర్ పై 48 గంటల ప్రచార నిషేధం విధించడంతో జమ్మికుంట రోడ్ షో రద్దయింది. ఈ నేపథ్యంలో వీణవంకలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోరిన మీదట కేసీఆర్ ఇందుకు అంగీకరించినట్లు తెలిసింది. మాజీ సి ఎం కేసీఆర్ వీణవంకకు రావడం, కౌశిక్ నివాసంలో బస చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
పరిణతి ప్రదర్శిస్తున్న యువనేత!
మొదట్లో కౌశిక్ ఏది మాట్లాడినా.. సోషల్ మీడియాలో, మీడియాలో వివాదం చెలరేగేది. దీంతో ఆయనను విపరీతంగా ట్రోల్ చేసేవారు. ఎప్పుడు వివాదాలు ఆయనను చుట్టుముట్టేవి. కానీ అయన ఈ విషయమై పరిణతి ప్రదర్శిస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవైపు కార్యకర్తలను, పార్టీ శ్రేణులను కాపాడుకుంటూ.. వారికి భరోసా ఇస్తూనే.. మరోవైపు ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు.
అధినేత దృష్టిలో…
గులాబీ బాస్ కేసీఆర్ దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నారు. కౌశిక్ లో నాయకత్వ లక్షణాలు గుర్తించిన గులాబీ బాస్ ఆయనకు మొదట ఎమ్మెల్సీ, విప్ ఇచ్చారు. 2023 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా చెలామణి అయిన ఈటల రాజేందర్ ను ఓడించి అధినేత దృష్టిలో ప్రత్యేక స్థానం పొందారు. కరీంనగర్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ “హుజురాబాద్ టైగర్ కౌశిక్” అని సంభోదించారంటే.. అయన దృష్టిలో కౌశిక్ స్థానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పార్టీ శ్రేణులను కాపాడుకోవడం, ప్రజలతో మమేకమై పనిచేయడం ద్వారా కౌశిక్ అధినేతను మెప్పించారు. ప్రత్యర్థులపై సందర్భోచితంగా తూటాల్లాంటి మాటలతో విమర్శలు చేయడంతో కౌశిక్ దిట్ట. అందుకే రాష్ట్ర పార్టీ కూడా తరచూ.. కౌశిక్ రెడ్డిని ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ఉపయోగించుకుంటోంది. ఇటీవల దానం నాగేందర్ పార్టీ మారిన సందర్బంగా కౌశిక్ ఎమ్మెల్యేలతో వెళ్లి స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. కాంగ్రెస్ బీజేపీ విమర్శలకు కరీంనగర్ లోనూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి విమర్శలు ఎక్కుపెట్టారు.
మరోసారి మెజారిటీ దిశగా..
2004 నుండి హుజురాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ హవా కొనసాగుతోంది. కేవలం ఒక్క 2021 లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా.. మిగతా ప్రతి ఎన్నికలో గులాబీ హవా కొనసాగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలిచినప్పటికీ.. హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం బీ ఆర్ ఎస్ పార్టీకే మెజారిటీ లభించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థి విజయం కోసం కౌశిక్ వ్యూహ రచన చేస్తున్నారు. ఎత్తులు పై ఎత్తులతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ మల్కాజిగిరి స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులను, ఈటల వర్గాన్ని గులాబీ పార్టీ వైపు తిప్పే ప్రయత్నం కౌశిక్ చేస్తున్నారు. ఇప్పటికే అయన బి ఆర్ ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తో కలిసి పలు ప్రచార సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తూటాల్లాంటి మాటలతో విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. సంస్థాగతంగా బలంగా లేకపోవడం ఇక్కడ బిఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.
అందరి దృష్టి వీణవంక పై
బీ ఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీణవంకకు రావడంతో అందరి రాజకీయ వర్గాల దృష్టి వీణవంక పై పడింది. అయన కౌశిక్ నివాసంలో బస చేయడం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఆనతి కాలంలోనే కౌశిక్ అంచెలంచెలుగా ఎదగడం, అధినేత కేసీఆర్ కు, బీ ఆర్ ఎస్ పార్టీకి వీర విధేయుడిగా మారడం.. హుజురాబాద్ లో గులాబీ జెండా ఎగరేయడం వంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ బస చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వీణవంక వేదికగా గులాబీ అధినేత కేసీఆర్ ఎలాంటి సందేశం ఇస్తారనే అంశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.