జగిత్యాల, జనతా న్యూస్: ఈ నెల 30 నుండి జూన్ 1 వ తేదీ వరకు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ టి. ఎస్. దివారక అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు, ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 నుండి జయంతి కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో 29 వ తేదీలోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని, క్రింది స్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ నెల 30 వ తేదీన భద్రాచలం నుండి పట్టువస్త్రాలను తెప్పించడం జరుగుతుందని, వాటిని శోభయాత్ర ద్వారా కళాకారులచే కార్యక్రమాల ద్వారా స్వామి వారికి అలంకరించడం జరుగుతుందని తెలిపారు. దేవాలయాల పరిసరలాలో కలర్స్ వేయించడం జరిగిందని, అలాగే 3 రోజుల పాటు లైటింగ్, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 31 వ తేదీ రాత్రి నుండి జూన్ 1 వ తేదీ ఉదయం వరకు సుమారు లక్షన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, 30 వేల మంది మాల విరమణ చేస్తారని తెలిపారు. ఈ 3 రోజుల పాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 4 లక్షల ప్రసాదలను అందుబాటులో జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో 64 సి. సి. కెమెరాలు ఉండగా అదనంగా 50 సి. సి. కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 6 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు.
అలాగే 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని, రోజులు 30 ప్రోగ్రాంలు లు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటాయని తెలిపారు. ఇందుకోసం ఒక వేదికను ఏర్పాటు చేసి 100 మంది కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. అలాగే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కొండపైకి వెళ్లేందుకు ఆర్. టి. సి. బస్సులను 4 కి పెంచాలని, 7 పార్కింగ్ స్థలాల్లో కచ్చితంగా ట్రిప్స్ వేయాలని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆదేశించారు
. కోనేరు వద్ద భక్తులు అధిక సంఖ్యలో స్నానం ఆచరించే వీలు ఉన్నందున ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేయించాలని మున్సిపల్ అధికారులను, భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ అధికారులను, 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని విద్యుత్ అధికారులను ఆయన ఆదేశించారు. మరియు ఉదయం ఎండ, సాయంత్రం వాన ఉండడం వల్ల ఎక్కడైనా నీరు నిండి రహదారిలో వెళ్ళుటకు భక్తులకు ఇబ్బంది కలుగ కుండా చూడాలని అన్నారు. కేశఖండనకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా కళ్యాణ కట్ట వద్ద 1500 నుండి 2000 మంది నాయీబ్రాహ్మణులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పబ్లిక్ టాయిలెట్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జయంతి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయుటకు షిఫ్ట్ ల వారీగా అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, జెడ్పీ సి. ఇ. ఓ. రఘువరన్, డి. ఎస్పీ., రఘు చందన్, కొండగట్టు ఆలయ ఈ. ఓ. చంద్ర శేఖర్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల కమిషనర్లు, ఎంపీడీఓలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.