తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పగలు, రాత్రి అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్న సమయం బయటకు రావాలన్నా జనం జంకుతున్నారు. గత 4 రోజులుగా వాతావరణం అంతా చల్లబడింది. ఈ పరిస్థితి ముసలివాళ్లు , పసిపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల చలిని తట్టుకోవడం కష్టంగా ఉంటుందని తెలిపారు. 60 ఏళ్లు దాటిన ముసలివాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
హైదరాబాద్, జనతా న్యూస్: ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి తదితర దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొంటున్న వారికి చలి తీవ్రత కారణంగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రక్తనాళాలు సంకోచించడంతో ముప్పు పెరుగుతుందని.. రక్తనాళాల్లో చిన్న చిన్న బ్లాకులు ఉంటే.. రక్తప్రసరణలో అడ్డంకుల కారణంగా గుండె, మెదడుకు సరఫరా ఆగిపోయి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే అవకాశముందని తెలిపారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.
-
చలికాలం ఈ జాగ్రత్తలు తీసుకోండి..
చలికాలంలో ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారాలు తినకూడదు. ఎప్పటికప్పుడు వేడివేడిగా ఉన్న పదార్థాలను మాత్రమే తినాలి. చలికాలంలో వెచ్చదనం కోసం చాలా మంది టీలు, కాఫీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. వాటికి బదులుగా గ్రీన్ టీ తాగడం ఉత్తమం. చలికాలంలో వచ్చే జలుబు దగ్గు జ్వరం లాంటివి దరిచేరకుండా చూసుకోవాలి. వ్యాధి నిరోధకతను పెంచుకోవడం కోసం పాటు విటమిన్ -సి ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి. ఉసిరి, జామ, నిమ్మ, నారింజ పండ్లలో విటమిన్ -సీ ఎక్కువగా ఉంటుంది.
-
మొదలైన ‘గజగజ’.. రేపు, ఎల్లుండి జాగ్రత్త..!
తెలంగాణలో చలి బెంబేలెత్తిస్తోంది. రానున్న రెండు రోజులు (రేపు, ఎల్లుండి) మరింత అధికంగా ఉంటుందని. హైదరాబాద్ వాతావరణ కేంద్రంపేర్కొంది. రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్ జిల్లాలో 12.5 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. రెండు రోజుల తర్వాత చలి కాస్త తగ్గినా.. డిసెంబర్ చివరి వారం నుంచి మళ్లీ పెరుగుతుందని వెల్లడించింది.
-
ఆసిఫాబాద్ ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో.. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని సిర్పూర్ మండలంలో అత్యల్పంగా 10.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. తిర్యాణి మండలం గిన్నెధరిలో 11.7, ఆసిఫాబాద్ మండలంలో 12.2, కెరమెరి మండలంలో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలకు చేరిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.