జనతా న్యూస్:తె లంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాఆశీర్వాద సభలను బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. శుక్రవారం కరీంనగర్ నగరంలో నిర్వహించే ప్రజాఆశీర్వాద సభలో ఆయన పాల్గొంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ హవా సాగుతోంది. మరోసారి ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడేందుకు కేసీఆర్ కరీంనగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఇందులో భాగంగా ఆయన ఇప్పికే జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పర్యటించారు. చివరికిగా కరీంనగర్ లో పర్యటించనున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరుపున గంగుల పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడుసార్లు గెలిచి నాలుగోసారి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతీసారి ఎన్నికల్లో కరీంనగర్ ప్రత్యేకంగా నిలుస్తోంది. పలు కీలక హామీలు కరీంనగర్ జిల్లాలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆయన ప్రసంగం ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరుతారు. 12.50 వరకు బేగంపేట చేరుకుంటారు. 12.55 కు హెలిక్యాప్టర్ లో బయలుదేరి 1,30 గంటలకు కరీంనగర్ చేరుకుంటారు. నగరంలో ఏర్పాటు చేసిన శ్రీ రాజరాజేశ్వర కళాశాల మైదనాంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఆ తరువాత 2.35 గంటలకు గంగధర మండల పత్తిపాకలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి జమ్మికుంటకు చేరుకుని అనంతరం హన్మకొండ జిల్లా పరకాల కు బయలుదేరుతారు.
కేసీఆర్ రాక సందర్భంగా కరీంనగర్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి గంగుల కమలాకర్ తో పాటు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సభా వేదికను గురువారం పరిశీలించారు. కేసీఆర్ రాక సందర్భంగా కరీంనగర్ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.