Kcr : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ బిజీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. ఈమేరకు ఆయన ప్రచారాలు నిర్వహించే షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 15న హుస్నాబాద్ లో జరిగే సభతో ప్రారంభమై నవంబర్ 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో జరిగే సభలతో ముగుస్తుంది. నవంబర్ 9న ఒకే రోజు రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ వేస్తారు. ఈరోజు ఉదయం సిద్ధపేట జిల్లాలోని కోనాయపల్లి వేంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం గజ్వేల్ లో మొదటి నామినేషన్, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో నామినేషన్ చేస్తారు.
సీఎం కేసీఆర్ ఈనెల 15న హుస్నాబాద్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత అక్టోబర్ 16న జనగాం, భువనగిరి, అక్టోబర్17న సిరిసిల్ల, సిద్ధిపేట, అక్టోబర్18న జడ్చర్ల, మేడ్చల్, అక్టోబర్26న అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడు, అక్టోబర్ 27న పాలేరు, స్టేషన్ ఘన్ పూరు, అక్టోబర్29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, అక్టోబర్ 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణ ఖేడ్, అక్టోబర్ 31 హుజూర్ నగర్, మిర్యాల గూడ, దేవరకొండలో పర్యటించారు. నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లెందు, 2న నిర్మల్, బాల్కొండ ధర్మపురి, 3న భైంసా, ముథోల్, ఆర్మూర్, కోరుట్ల, 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గవ్వాల్, ముఖ్తల్,నారాయణ పేట, 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో ప్రచారం నిర్వహిస్తారు.
కొన్ని రోజులుగా కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారు. ఇటీవలే ఆయన కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కేసీఆర్ రాజకీయాలకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. 15న హుస్నాబాద్ లో నిర్వహించే ప్రచార సభలోనే భీ ఫాంలు అందజేస్తారని తెలుస్తోంది.