పవన్ లూమ్ పరిశ్రమకు విద్యుత్ సరఫరాపై..
ప్రభుత్వం సమాలోచనలు
5వ కేటగిరీలో యూనిట్‌కు రూ.1.25 ఛార్జీ
మాజీ ఎమ్మెల్సీచెరుపల్లి, విప్ ఆది శ్రీనివాస్‌తో చర్చలు
సిరిసిల్ల యజమానుల ప్రతిపాదనలపై సానుకూలత
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కారు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇప్పటికే యార్న్ డిపోను మంజూరు చేసిన ప్రభుత్వం..తాజాగా విద్యుత్ సమస్య పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ నెల 25న సిరిసిల్లలో జరిగే ఈఆర్‌సీ హీయరింగ్‌తో పాటు పరిశ్రమకు విద్యుత్ రాయితీపై సమాలోచనలు చేస్తుంది. ఇందులో భాగంగా కర్ణాటక తరహాలో యూనిట్‌కు రూ.1.25 ఛార్జి నిర్ణయించాలనే యజమానుల డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. దీనిపై మంగళవారం సిరిసిల్లలో యజమానులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు చర్చలు జరిపారు. కర్ణాటక ఫార్ములా, లేదా ఉచిత విద్యుత్..ఈ అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు.
సిరిసిల్ల నేతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. స్వశక్తి మహిళా సంఘ సభ్యులకు కోటికి పైగా చీరల ఆర్డర్‌తో పాటు ముడి సరుకైన నూలు కొనుగోలుకు పెట్టుబడి లేకుండా యార్న్ డిపోనూ మంజూరు చేసింది. ఇక ప్రధాన విద్యుత్ రాయితీ సమస్యపై సర్కారు దృష్టి సారించింది సర్కారు. ప్ర్రస్తుతం పవర్ లూమ్ పరిశ్రమలోని యూనిట్లు థర్డ్ కేటగిరీ పరధిలోకి వెళ్లడంతో విద్యుత్ యూనిట్‌కు రూ. 8లు చెల్లించాల్సి ఉంది. ఈ సమస్య పరిష్కారానికి న్యాయపరమైన, ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మంగళవారం సిరిసిల్లలో యజమానులతో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, ప్రభుత్వ విప్ చర్చలు జరిపారు. యజమానుల పలు డిమాండ్లు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘ సమాలోచనలు జరిపారు.
తెరపైకి కర్ణాటక ఫార్ములా..!
కర్ణాటక రాష్ట్రంలో పవర్ లూమ్ పరిశ్రమకు అక్కడి ప్రభుత్వం భారీగా విద్యుత్ రాయితీని ఇస్తుంది. 20 హెచ్‌పీ వరకు విద్యుత్ రాయితీ ఇస్తోంది. యూనిట్‌కు రూ.1.25 ఛార్జి మాత్రమే అక్కడి యజమానులు చెల్లిస్తున్నారు. దీనివల్ల ఒక ఆసామి 24 పవర్ లూమ్‌ల వరకు రాయితీపై నడుపుకునే అవకాశాలుంటాయి. దీనివల్ల అటు కార్మికులకు, ఇటు ఆసాములకు లాభాలు వస్తున్నాయి. తెలంగాణలో గతంలో ఫోర్త్ కేటగిరిలో 10 హెచ్‌పీల వరకు యూనిట్‌కు రూ. 2 రూపాయలు చెల్లించే వారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు, సెస్ నిర్ణయాలతో యూనిట్ ఛార్జి రూ.8 చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్దంలో విద్యుత్ ఛార్జీలు చెల్లించాలంటే, ఆసాములు తీవ్ర నాష్టాలకు గురౌతారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడి యజమానులు కర్ణాటక ఫార్ములాను సూచిస్తున్నారు. దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా పవర్ లూమ్ పరిశ్రమ మొత్తానికి సంవత్సరానికి రూ. 7 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది.
ఉచిత విద్యుత్ సరఫరాపై..
కర్ణాటక రాష్ట్రంలో పవర్ లూమ్ పరిశ్రమకు ఇస్తున్న విద్యుత్ రాయితీ కంటే తెలంగాణలో బెటర్‌గా రాయితీ ఇచ్చే అవకాశాలూ ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో 5 వేలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మిగతా నల్గొండ, ఇతర జిల్లాల్లో కలుపుకుంటే మొత్తం పది వేల విద్యుత్ కనెక్షన్ల కంటే మించవు. రాష్ట్రం వ్యాప్తంగా పవర్ లూమ్ పరిశ్రమకు ఉచిత విద్యుత్ ప్రకటిస్తే..సంవత్సరానికి సుమారు రూ. 15 కోట్ల భారం మాత్రమే ప్రభుత్వంపై పడనుంది. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద మైలేజీ వచ్చే అవకాశాలు సైతం ఉంది. ఈ విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ల నున్నారు ప్రతినిధులు. వచ్చే నెలలో సిరిసిల్లకు సీఎం పర్యటన సందర్భంగా వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అయితే విద్యుత్ రాయితీ, ఇతర సమస్యలపై సీఎం తీసుకునే చర్యలపై సర్వత్రా ఎదురు చూస్తున్నారు సిరిసిల్ల నేతన్నలు.
కర్ణాటక ఫార్ములా !

- Advertisment -