- కరీంనగర్‌లో రూ.2.36 కోట్ల నగదు పట్టివేత
- భారీగా పట్టుబడడంతో నగరంలో చర్చ
- ఆ షాపింగ్ మాల్‌కు చెందినవే అని ప్రచారం!
Karimnagar : కరీంనగర్ (జనతా న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో మరో నెల పదిహేను రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా నిత్యం పోలీసులు రాత్రనక పగలనక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా కరీంనగర్ నగరం నడిబొడ్డున.. వేయి కాదు, లక్ష కాదు.. ఏకంగా రూ.2 కోట్ల పైనే నోట్ల కట్టలు పట్టుబడ్డాయి.
కరీంనగర్‌లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ వద్ద ఇన్‌స్పెక్టర్ రాంచందర్ రావు వాహన తనిఖీలు చేపట్టారు. వ్యానులో 2,36,48,494 రూపాయలను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అంత పెద్ద మొత్తంలో డబ్బు తరలించాలంటే తగిన అనుమతి పత్రాలు ఉండాలి. కానీ, అవేమీ లేకుండానే తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ డబ్బును పోలీసులు సీజ్ చేశారు. ఆ తరువాత ఎన్నికల గ్రీవెన్స్ కమిటీకి అప్పగించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు నగరంలో అంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడడంతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే.. ఈ డబ్బు ఇటీవల నగరంలో కొత్తగా ప్రారంభమైన షాపింగ్ మాల్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఇన్ని నోట్ల కట్టలు ఏదైనా పార్టీకి ఫండింగ్ చేసేందుకేనా..? ఏదైనా అభ్యర్థికి చేరవేసేందుకేనా..? అంటూ విమర్శలు తలెత్తాయి. పట్టుబడిన డబ్బుకు అనుమతిపత్రాలు సైతం లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై షాపింగ్ మాల్ యజమానులు ఇప్పటివరకు స్పందించలేదు.