Karimnagar : కరీంనగర్ లో ఎక్కడా చూసినా జలకళే కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజా ఆశీర్వాద సభ బుధవారం కరీంనగర్ లో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయన్నారు. అందుకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి అని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ లోనే బీజం పడిందని, తెలంగాణ వచ్చాక ఎన్ని మార్పులు వచ్చాయో గమనించాలని అన్నారు. వెయ్యి గురుకులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. చదువుకుంటానంటే పిల్లలకు రూ.20 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపుతున్నామని కేటీఆర్ చెప్పారు.

తెలంగాణలో మరోసారి కేసీఆర్ కు అవకాశం ఇవ్వాలని, అలాగే కరీంనగర్ లో గంగుల కమలాకర్ ను గెలిపించాలన్నారు. కరీంనగర్ లో గంగుల మీద పోటీ అంటే భయపడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే పోటీ చేసిన బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితి ఏం జరిగిందో ప్రజలు గమనించాలని అన్నారు. కేసీఆర్ పాలనలో కరీంనగర్ అభివృద్ధి దిశలో దూసుకుపోతుందని, మళ్లీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేపడుతామని కేటీఆర్ అన్నారు.