-
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జనతా న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 లో పోటీచేసే అభ్యర్థులు వారి నామినేషన్లను స్వయంగా సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో అందించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ 3 శుక్రవారం నుండి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలు కానున్న దృష్ట్యా ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు వారి నామినేషన్ పత్రాలను ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని, సువిధ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తును సర్పించినప్పటికి అప్లికేషన్ సక్సెస్ అయిన తరువాత వచ్చే పత్రాలపై అభ్యర్థి స్వయంగా సంతకం చేసి ఆ కాపీలను ఆర్వో కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
నామినేషన్ కొరకు కళ్లద్దాలు, కండువ, టోపి వంటివి లేకుండా, బ్యాక్ గ్రౌండ్ తెలుపుతో అభ్యర్థి స్పష్టంగా కనిపించే 2 x 2.5 సైజు పాస్ ఫోటోలు 20 ఇవ్వాలన్నారు. నామినేషన్ దాఖలుకు ఒకరోజు ముందు అభ్యర్థి పేరున ఎన్నికల ఖర్చుల కొరకు కొత్తగా బ్యాంక్ ఖాతాను ప్రారంభించాలని, ఖాతాకు సంబంధించిన వివరాలను ఆర్వో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల ఖర్చులు ఏవైనా 20 వేల లోపు నగదు రూపంలో అంతకు మించి జరిగే ఖర్చును చెక్కురూపంలో చెలించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థుల్లో గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒక ప్రతిపాదకున్ని, ఇండిపెండెంట్ మరియు రిజిస్టర్ పార్టీలకు చెందిన అభ్యర్థులు 10 మంది ప్రతిపాదకుల సంతకాలను సమర్పించాల్సి ఉంటుందని, వీరందరూ ఖచ్చితంగా సంబంధిత నియోజక వర్గానికి చెందిన ఓటర్ల అయి ఉండాలని పేర్కొన్నారు.
ప్రతిపాదకులలో ఎవరైన నిరక్షరాస్యులై సంతకం చేయలేని వారు ఉన్నట్లయితే వారి బోటనవేలి ముద్ర (థంబ్ ఇంప్రెషన్) ను ఆర్.ఓ సమక్షంలో ఇవ్వాలసి ఉంటుందన్నారు. రిజర్వు చేసిననియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు వారి కుల దృవీకరణ నామినేషన్ రోజు సమర్పించాలని, దృవపత్రాలను సమర్పించని పక్షంలో నామినేషన్ ప్రక్రియ ముగిసే లోగా, స్కృటిని సమయానికి ఆర్వో కార్యాలయంలో దాఖలు చేయాల్సి ఉంటుందని అన్నారు. నామినేషన్ ముందు జనరల్ అభ్యర్థులు 10 వేలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 5 వేల రూపాయలను చెక్కు లేదా చాలన్ రూపంలో సెక్యూరిటి డిపాజిట్ గా చెల్లించాలని, ఒక అభ్యర్థి రెండు నియోజక వర్గాలలో ఒనేసారి పోటీ చేసుకోవచ్చని తెలిపారు. నామినేషన్ సమర్పించిన రోజే ఎలక్షన్ ఏజెంట్ వివరాలను కూడా తెలియజేయాలని, అభ్యర్థులు ఎన్ని నామినేషన్ లను సమర్పించిన రిజిష్టర్లో నమోదు చేసిన క్రమ సంఖ్య ఆధారంగానే నామినేషన్ పత్రాలను పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లాలో ఎక్కడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, బహుమతులు, అక్రమంగా మద్యం సరఫరాల జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , ఎక్కడైన ప్రజలను ప్రలొభాలకు గురిచేస్తున్నట్లు తెలిసినట్లయితే ఆ ప్రాంతం నుండి సి- విజిల్ మొబైల్ యాప్ ద్వారా లైవ్ లోకేషన్ తో కూడిన ఫోటోతో ఫిర్యాదును సమర్పించాలని, ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని, మా దృష్టికి వచ్చిన సుమోటాగా స్వీకరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నియోజక వర్గాలలోని వాహనాల అనుమతుల కొరకు పొలీస్ నోడల్ అధికారుల ద్వారా ఆనుమతులను జారీ చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల కొరకు కావాల్సిన మౌళిక వసతులను కల్పించడం జరుగుతుందని, వికలాంగులు, 80 సంవత్సరాలు పైబడిన వృద్దుల కొరకు ప్రత్యేక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చోప్పదండి, మానకొండూర్, కరీంనగర్, హుజురాబాద్ ల ఆర్వోలు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, కె. మహేశ్వర్, రాజు లు, జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్, ఎసిపి అడ్మిన్ లక్ష్మీ నారాయణ, బిఎస్పి పార్టీ ప్రతినిధి సిరిసిల్లా అంజయ్య, బిజేపి పార్టీ ప్రతినిధి బి. రమణరెడ్డి, సిపిఐ (యం) పార్టీ ప్రతినిధి మిల్కూరి వాసుదేవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మెహన చారి, ఎస్.కె. సిరాజ్ హుస్సెన్, యం.ఐ.యం. పార్టీ ప్రతినిధి సయ్యద్ బర్కత్ అలీ, మెహ్మద్ అబ్బాస్ సమి, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి శ్రీనివాస్, టిడిపి పార్టీ ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.