.కరీంనగర్ టౌన్ జనవరి 23 (జనతా న్యూస్) కరీంనగర్ లో ఫ్రీడమ్ ఫైటర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం రోజున ఆయన జయంతి సందర్భంగా నగరంలోని మంచిర్యాల రోడ్డులో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు మరియు పలువురు కార్పోరేటర్లు పూల మాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జయంతి మాత్రమే ఉండి వర్థంతి లేని నాయకులు కేవలం సుభాష్ చంద్రబోస్ ఒక్కరే అని గుర్తు చేశారు.

స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడే ఆజాద్ హిందు ఫౌజ్ పేరిట ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి పోరాటం చేసిన గొప్ప మహనీయులని గుర్తు చేశారు. ఆనాడు ఆయన చూపిన తెగువ నేటి తరానకి ఆదర్శం అన్నారు. నేటి తరం కూడ ఆయన చూపిన ఆశయాలను అనుసరిస్తూ తెగువను చూపించాలని అన్నారు. ఇలాంటి మహనీయుల త్యాగాలు, ఆశయాలను నేటి తరం నెమరు వేసుకోవాలని పిలుపు నిచ్చారు. సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప మహనీయులు ఉన్న గడ్డలో మనమంతా జీవించడం చాలా హర్షనీయమన్నారు. వారి జయంతి వేడుకల్లో మా పాలకవర్గం పాల్గొనడం చాలా సంతోషకరం అన్నారు. సుభాష్ చంద్రబోస్ ఆశయాలను స్పూర్తిగా మనమంతా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు హర్ష కిరణ్మయి మల్లేషం, గంట కళ్యాణీ శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్. గుగ్గిల్ల జయశ్రీ శ్రీనివాస్, ఈఈ మహేంధర్ తదితరులు పాల్గొన్నారు.
