Wednesday, September 18, 2024

కరీంనగర్‌ ఎమ్మెల్సీపై గురి

ఆరు నెలల ముందు నుండే ఫోకస్‌
ఎమ్మెల్యేల సమిష్టి కృషిపై కాంగ్రెస్‌ భవిష్యత్‌
ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రచారణాస్త్రాలు

జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి
కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. ఎన్నికకు మరో ఆరు నెలల ముందుగానే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడ లను అధికార కాంగ్రెస్‌ నిశితంగా పరిశీలిస్తుండగా..మరోవైపు టికెట్‌ కోసం ఆయా పార్టీల ఆశావాహులు ఇప్పటి నుండి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికకు ఓటర్ల నమోదుపై పలు సంఘాల ప్రతినిధులు, పార్టీల నేతలు దృష్టి సారించారు. ఆయా వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు ఓటరు నమోదు కార్యక్రమాలతో కొందరు ముందుకెళ్తుండగా, మరి కొందరు నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు జాబ్‌ మేళా లాంటివి చేపడుతున్నారు.
పార్టీల ప్రజా ప్రతినిధుల బలా బలాలు..
కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల లోని 36 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అత్యధికంగా అధికార కాంగ్రెస్‌ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీఆర్‌ఎస్‌కు 11, బీజేపీకి ఆరుగురు ఎమ్మెల్యేలున్నారు. అయితే నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ పార్లమెంటు నియోజక వర్గాలతో పాటు కరీంనగర్‌ నుండి బీజేపీ ఎంపీగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.కాంగ్రెస్‌ నుండి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఒకరే ఉండగా, ఇక బీఆర్‌ఎస్‌కు పార్లమెంటు సభ్యుల మద్దతు లేకుండా పోయింది. స్థానిక సంస్థల్లో.. ప్రధానంగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, పంచాయతీ సర్పంచ్‌లు ఎక్కువగా ఉండే బీఆర్‌ఎస్‌కు..వారి పదవీ కాలం ముగియడం, ప్రస్తుత రాజీకీయ పరిస్థితుల్లో స్తబ్దంగా ఉండడం కొంత మైనస్‌. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా..బీఆర్‌ఎస్‌ సైతం ఇప్పటి నుండి ఎత్తులు వేస్తోంది. సరైన అభ్యర్థి ఎంపికపై గులాబీ బాస్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇద్దరు రాష్ట్ర మంత్రులకు ప్రతిష్టాత్మకం..
ప్రస్తుత ఎమ్మెల్సీగా జీవన్‌ రెడ్డి ప్రాతినిధ్యం కొనసాగుతున్నారు. వచ్చే ఆరు మాసాల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడం రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌కు సవాల్‌గా మారనుంది. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో నిరుద్యోగ యువతను ఆకట్టుకునే అవకాశాలు అధికార కాంగ్రెస్‌కు ఉన్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామకాలు, శిక్షణా కేంద్రాల ఏర్పాటు..తదితర అంశాలపై విద్యార్థులు, పట్టభద్రులను ఆకట్టుకునేలా ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తే, ఓటర్ల నుండి మద్దతు వచ్చే అవకాశాలుంటాయని పలువురు భావిస్తున్నారు. అయితే..ఆ పార్టీ అభ్యర్థి ఎంపిక కూడా గెలుపుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ అదిష్టానం, సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకునే నిర్ణయాలపై ఎమ్మెల్సీ గెలుపు అవకాశాలుంటాయి.
పార్టీ టికెట్‌ లేదంటే స్వతంత్రంగా..
ఎమ్మెల్సీ ఎన్నికకు ఆరు నెలల ముందు నుండే టికెట్ల కోసం ఆయా పార్టీల నేతలు, తటస్తులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ సారి విద్యా సంస్థల అధినేతలు పోటీలో ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రముఖ విద్యా సంస్థ అధినేత ఒకరు అధికార పార్టీ నుండి తనకు అవకాశం వస్తుందని ప్రకటించడం విశేషం. ఒకవేళ రాకుంటే స్వతంత్రంగా నైనా పోటీకి సై అంటున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను సైతం అంటూ ఓ మైనార్టీకి చెందిన ఓ విద్యా సంస్థ నిర్వాహకుడు కరీంనగర్‌లో జాబ్‌ మేళా ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రయివేటు విద్యా సంస్థల మాజీ అధ్యక్షులు..ఇలా పలు విద్యా సంస్థల నిర్వాహకులు సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తాను సైతం అంటూ ముందుకొస్తున్నారు. ఇక ఆయా పార్టీల నుండి ఆశావాహులు షరా మామూలే. ఆయితే..ఈ ఆరు మాసాల కాలంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page