హైదరాబాద్‌లో పటేల్ విగ్రహ ఏర్పాటు
పిడికెడు మందికి భయపడేది జాతీయ పార్టీయా..?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్-జనత న్యూస్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో సర్ధార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తెలంగాణ విమోచన దినోత్సవాల్లో భాగంగా కరీంనగర్ టీఎన్జీవోస్ కళ్యాణ మండపంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరునేని అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘ఫొటో ఎగ్జిబిషన్’ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ..కొమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ, బూర్గుల రామక్రిష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ తదితరుల పోరాటాల చరిత్రను స్మరించుకునే అవకాశం ఈ ఎగ్జిబిషన్ ద్వారా కలుగుతోందన్నారు. తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలను నేటి తరానికి తెలియ జేయకపోవడం బాధాకరమన్నారు. ఈ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే…ఆ సమయంలో తెలంగాణకు స్వాతంత్య్రం ఎందుకు రాలేదు? దానికి కారకులెవరు? తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చింది? అనే విషయాలను నేటి తరానికి పూర్తిగా తెలియజేయలేకపోవడం విడ్డూరమన్నారు. రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎంకు భయపడి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదన్నారు. పటేల్ ముమ్మాటికీ తమకు అరాధ్యుడేనని, బీజేపీ అధికారలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఏటా తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అరుదైన చిత్రాలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని, నగర ప్రజలు వీక్షించాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి ఎం. వెంకట రాంబాబు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే..

- Advertisment -