ముగిసిన డీఎస్‌సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
1నుండి 5 వరకు కొనసాగిన వెరిఫికేషన్
7న జాబితా ఫైనల్ అయ్యే అవకాశం
9న సీఎంచే నియామకపు పత్రాల పంపిణీ
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
డీఎస్‌సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారంతో ముగిసింది. ఆయా జిల్లాల కేంద్రాల్లో డీఈవోల సమక్షంలో సర్టిఫికెట్లను పరిశీలించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 11, 062 పోస్టులకు ర్యాంకులను బట్టి 1:3 వంతున అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దన్గర్‌వాడీ హైస్కూల్‌లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. జిల్లా విద్యాధికారి జనార్థన్ రావు సమక్షంలో సర్టిఫికెట్ల పరిశీలన చేయగా.. 7న వెబ్‌సైట్‌లో తుది జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి. 9న హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి టీచర్లకు నియామకపు పత్రాలు అందజేయనున్నారు.
డీఎస్‌సీ ప్రకటన, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఇక ఫైనల్ జాబితా, నియామకపు పత్రాల జారీ మిగిలి ఉంది. దసరా లోపు నియామకపు పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీంతో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల కొరత కొంత తీరనుంది. ఉపాధ్యాయుల నియామకాల్లో భాగంగా కరీంనగర్ జిల్లాకు 245 మంది కొత్తగా ఉపాధ్యాయులు రానున్నారు. ఇందులో అత్యధికంగా ఎస్జీటి తెలుగు విభాగంలో 71 మందిని టీచర్ల నియామకం చేయనున్నారు. ఇందులో ఓసిలు 89, ఎస్సీ 49, ఎస్టీ 18, బీసీ 52, ఈడబ్ల్యూఎస్ 17, దివ్యాంగులు 11 మంది ఉన్నారు. నియామకపు ప్రక్రియ పూర్తయ్యాక ఆయా ప్రభుత్వ పాఠశాల లకు కేటాయించే అవకాశాలున్నాయి.
దన్గర్‌వాడీ స్కూల్‌లో సర్టిఫికెట్ల పరిశీలన
కరీంనగర్ జిల్లాలోని డీఎస్‌సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీన నగరంలోని దర్గర్‌వాడీ స్కూల్‌లో చేపట్టారు. డీఈవో జనార్ధన్ రావు సమక్షంలో ఈ నెల 1 నుండి 5 వరకు కొనసాగింది. ఆయా విభాగాల వారీగా ప్రత్యేక గదుల్లో దృవ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్యాస్ట్, స్టడీ ఇతరాత్ర సర్టిఫికెట్లను పరిశీలించారు. అభ్యంతరాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకున్నారు అధికారులు. తొలుత 1 :3 చొప్పున పరిశీలించగా 7న 1 : 1 చొప్పున వెబ్‌సైట్‌లో ప్రదర్శించే అవకాశాలున్నాయి. సర్టిఫికెట్ల పరిశీలనలో ఎలాంటి లోటు పాట్లు జరగకుండా, అనుమానాలకు తావివ్వకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
9న హైదరాబాద్‌లో నియామకపు పత్రాల పంపిణీ
9న హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపు పత్రాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా నుండి అభ్యర్థులు తరలి వెళ్లనున్నారు. సుదీర్ఘ కాలం తరువాత డీఎస్‌సీ నియామకాలు చేపట్టడంతో అభ్యర్థుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. రానున్న కొద్ది కాలంలో మరో డీఎస్‌సీ వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆశలతో ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. కాగా..ఎస్సీ వర్గీకరణ జరిగాక నియామకాలు చేపట్టాలని ఎంఆర్‌పీఎస్ అధినేత మంద కృష్ణ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 9న నిరసన కార్యక్రమాలకు ఆయన పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లాకు కొత్తగా 245 మంది టీచర్లు

- Advertisment -