- మొత్తం 2194 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
- 10,200 మంది పోలింగ్ సిబ్బంది విధుల నిర్వహణ..
- వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
- 2500 పోలింగ్ సిబ్బందితో గట్టి బందోబస్తు
కరీంనగర్, జనతా న్యూస్: పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 2194 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయా కేంద్రాలన్నింటికీ ఆదివారం సాయంత్రం పోలింగ్ అధికారులు, సిబ్బంది ఈవీఎంలను తీసుకెళ్లారు. పోలీసు భద్రత మధ్య ఈవీఎంలు పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నాయి. ఈ మేరకు సిబ్బంది పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది గంటల్లో పోలింగ్ స్టార్ట్ కానుంది. 13వ తేదీన మే 6 గంటల వరకే సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. 2500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నది. పార్లమెంట్ పరిధిలో 17లక్షల 97 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 8 లక్షల 77,483 మంది, మహిళలు 9 లక్షల 19,565 మంది ఉన్నారు. 102 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. వయోవృద్ధులు13,218 మంది, దివ్యాంగులు 41,573 మంది ఉన్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి పోలీస్ స్టేషన్లో వీల్ చైర్ ఏర్పాటు చేయనున్నారు. తాగునీరు, నీడ వసతి కూలర్లు, ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాట్లు పూర్తి చేశారు. మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న దృష్ట్యా ఒక్కొక్క పోలింగ్ కేంద్రాల్లో రెండేసి బ్యాలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి నిఘాను పటిష్టం చేశారు. మొత్తం 10,200 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. మొత్తం బ్యాలెట్ యూనిట్స్ 5500, కంట్రోల్ యూనిట్స్ 2743, వీవీ ప్యాట్స్ 3077 ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఐదు మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 1012 పోలింగ్ స్టేషన్ల ల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించ నున్నారు. కరీంనగర్ లోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలను అధికారులు పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. గట్టి బందోబస్తు మధ్య జిపిఎస్ అనుసంధానం చేసిన వాహనాల్లో వెళ్లి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి జాగ్రత్తలపై సూచనలు చేశారు. పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి పర్యవేక్షణలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి..
18 సంవత్సరాలు దాటిన వారందరూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాం. పోలింగ్ శాతం పెంచేందుకు ఈసారి ప్రత్యేకంగా దృష్టి సాధించాము. ప్రజలు ఓటు హక్కును తప్పకుండా వినియోగించు కోవాలి. ఎవరూ కూడా మిస్ కావద్దు.