Saturday, March 14, 2026

Karimnagar CP Mahanti : భూ కబ్జాలపై కరీంనగర్ సీపీ దూకుడు

  •  ఫిర్యాదుల కోసం ఈఓడబ్ల్యూ ఏర్పాటు
  •  22 రోజుల్లో 660 భూ కబ్జా కంప్లయింట్స్
  •  ఇప్పటికే నాలుగు కేసుల్లో ఏడుగురు కటకటాల్లోకి..
  •  తదుపరి ఎవరని ఆక్రమణదారుల్లో ఉత్కంఠ
  •  కాంప్రమైజ్ చేసుకునేందుకు బాధితుల చుట్టూ చక్కర్లు
  •  ప్రభుత్వ శాఖలపైనా అభిషేక్ మహంతి నజర్

(కరీంనగర్, జనత ప్రతినిధి)

కరీంనగర్ అంటేనే భూ దందాలకు నిలయం… వైట్ కాలర్ నేరస్తులకు కాసుల కోట.. అమాయకులను బెదిరిస్తూ.. అక్రమార్జనకు తెరలేపుతూ గత ప్రభుత్వ హయాంలో కోట్లకు పగడనెత్తిన వారు కోకొల్లాలు. భూ కబ్జాదారుల బాధితులు ఇన్నాళ్లు ఎక్కని పోలీసు స్టేషన్ మెట్టు లేదు.. తొక్కని ప్రభుత్వ కార్యాలయం గడపా లేదు. అయినా దక్కని న్యాయం.. ఆయా కుటుంబాల్లో ఒడవని దు:ఖం. ఇదీ మొన్నటివరకు.. ఇప్పుడు సీన్ మారింది. జిల్లాలోకి సింగం ఎంటరైంది. ఎలక్షన్ల బదిలీల్లో భాగంగా కరీంనగర్ సీపీగా నియామకం అయిన అభిషేక్ మహంతి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఎలక్షన్లు ముగిసిన మరుసటి రోజునుంచే వైట్ కాలర్ నేరస్తుల పనిపడుతున్నారు. పకడ్బందీ వ్యూహం.. అన్ని ఆధారాలతో నేరస్తులతో కటకటాల్లోకి పంపుతున్నారు. గడిచిన 22 రోజుల వ్యవధిలోనే కమిషనరేట్ పరిధిలో 660 భూ కబ్జా ఫిర్యాదులు రాగా.. ఇప్పటికే నాలుగు కేసుల్లో ఏడుగురిని జైలుకు పంపించారు కరీంనగర్ కొత్వాల్. దీంతో ఎప్పుడు ఏ స్టేషన్ నుంచి ఎవరికి పిలుపు వస్తుందా అని భూకబ్జాదారుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
ఖాళీ జాగా కనిపిస్తే చాలు..

తెలంగాణ ఆవిర్భావం తరువాత కరీంనగర్ ఎంతో అభివృద్ధి చెందింది. మరోవైపు నగరాన్ని స్మార్ట్ సిటీ కింద ఎంపిక చేశారు. దీంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ దందా జోరందుకుంది. శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. దీంతో మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీకి చెందిన పలువురు చోటామోటా నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్దల పేరు చెప్పుకుంటూ కనిపించిన ఖాళీ జాగాను గద్దల్లా ఎత్తుకుపోయారు. అమాయక ప్రజలను బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ దందా కరీంనగర్ శివారు ప్రాంతంలో జోరుగా సాగగా.. రేకుర్తి, చింతకుంట, కొత్తపల్లి, తీగలగుట్టపల్లి, ఆరేపల్లితోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భూ కబ్జాలు పెరిగిపోయాయి. కనిపించిన జాగాను కబ్జా చేయడం, ఇండ్లను కూల్చివేడం.. దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం.. మీటర్లు పెట్టి ఇంటినంబర్లు సంపాదించడం.. తదితర దందాలు వారికి కొట్టిన పిండిగా మారాయి. నగరానికి చెందిన కొందరు కార్పొరేటర్లు సైతం పంచాయితీల పేరిట భూ కబ్జాలకు పాల్పడి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి రూ.కోట్ల విలువైన భూమిని కబ్జా చేసినట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

for E paper click here

Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)

అండగా అధికారులు..

భూ అక్రమార్కులకు అప్పటి ప్రభుత్వంలోని అధికారులు పూర్తిస్థాయిలో అండగా నిలిచినట్లు సమాచారం. పోలీసుశాఖ నుంచి మొదలుకుని రిజిస్ర్టేషన్, రెవెన్యూ.. తదితర శాఖల అధికారులు వైట్ కాలర్ నేరగాళ్లకు సహకరించినట్లు సమాచారం. ఓ పోలీసు డివిజనల్ స్థాయి అధికారి అండతో ఓ లోకల్ లీడర్ శివారు ప్రాంతంలోని రూ.లక్షల విలువైన భూమి కబ్జా చేశారంటే.. అప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూ కబ్జా బాధితులు చాలా మంది అప్పటి పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తమకు అన్యాయం జరుగుతోందని గోడు వెల్లబోసుకోగా… కనీసం పట్టించుకోలేదని చాలా మంది చెబుకుంటున్నారు. పొద్దున లేస్తే పోలీసుస్టేషన్లు.. ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ చాలా మంది తిరిగారు. జిల్లాకు చెందిన ప్రధాన ప్రజాప్రతినిధి అక్రమార్కులకు అండగా నిలుస్తూ.. బాధితులతో సెటిల్ మెంట్ చేుసుకోవాలని సూచించడంతో తమకు ఇక న్యాయం జరగదని చాలా మంది భావించారు. తమ భూమి పోయిందని బాధపడ్డారు. గతంలో పనిచేసిన పోలీసు బాస్ లు సైతం జిల్లాలోని భూ దందాల్లో కల్పించుకోకపోవడం కొసమెరుపు.

సీపీ మహంతి రాకతో..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల బదిలీల్లో భాగంగా కరీంనగర్ సీపీగా అభిషేక్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. పక్కా ప్రణాళికలతో ఎన్నికలు పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో భూ దందాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటిచండంతో పోలీసు కమిషనరేట్‌కు భూ బాధితులు వెల్లువలా తరలివెళ్లారు. వారందరినీ చూసిన సీపీ షాక్ అయ్యారు. కరీంనగర్ లో ఏం జరుగుతోందని ఆరా తీశారు. నగరంలో.. సమీప పరిధిలో భూ కబ్జా మాట ఉండకూడదని నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) ఏర్పాటు చేశారు. అందులో నిక్కచ్చిగా పనిచేసే టీంను నియమించారు. నగరం పరిధిలోని భూ దందాలకు పాల్పడుతున్న వారి గురించి ఫైల్ తయారు చేయించారు. బాధితుల నుంచి దరఖాస్తులు కోరారు. దాంతో బాధితులంతా స్టేషన్ల బాట పట్టారు. పోలీసులకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్పెషల్ వింగ్ ఎంక్వయిరీ చేసి సీపీకి రిపోర్ట్ అందజేస్తోంది. ఆ తదుపరి సీపీ సూచనల మేరకు పోలీసులు చర్యలకు దిగుతున్నారు.

కటకటాల్లోకి కార్పొరేటర్లు..

భూ అక్రమార్కులపై కొరడా ఝులిపిస్తున్నారు. కరీంనగర్ నడిబొడ్డున భూ కబ్జాకు పాల్పడి ఏళ్లకాలంగా ఓ వృద్ధ దంపతులకు ఇబ్బందులకు గురిచేస్తున్న కార్పొరేటర్ తోట రాములు, ఆయన టీంను మొట్టమొదటిసారి అరెస్టు చేశారు. ఆ వెంటనే సీతారాంపూర్‌లో బుల్డోజర్ గ్యాంగ్ లీడర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కార్పొరేటర్ జంగిలి సాగర్‌ను అరెస్టు చేయడమే కాకుండా ఆయనపై ఏకంగా రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఆ తరువాత తీగలగుట్టపల్లిలో ఇల్లుకూల్చి వేసే వారిపై కేసులు నమోదుచేశారు. ఇటీవల ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సన్నిహితుడు, ఆర్టీఏ మెంబర్ తోట శ్రీపతిని అరెస్ట్ చేశారు.
ఇలా ఇప్పటివరకు నాలుగు కేసుల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికి సైతం భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వినకుంటే జైలుకు పంపిస్తామని చెప్పేస్తున్నారు. తీరుమార్చుకోని ఎంత పెద్ద లీడరైనా కటకటాల పాలు కాక తప్పదని.. అమాయకుల జోలికి వెళ్తే చూస్తూ ఊరుకోమని అంటున్నారు.

కబ్జాదారుల యూటర్న్..

సీపీ చర్యలతో మిగిలిన అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. దీంతో ఇప్పుడు వారంతా బాధితుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కాళ్లావేళ్లా పడుతున్నారు. సంధి కుదుర్చుకొని తమ పేరు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. తాము కబ్జా చేసిన భూములను తిరిగి ఇచ్చేస్తామని.. యజమానుల పేరిట రిజిస్ట్రేషన్ చేపిస్తామంటూ కాంప్రమైజ్‌కు వస్తున్నారు. ఒక్కసారి కేసు నమోదై జైలుకు పోతే పరువు పోతుందని.. భవిష్యత్తు సైతం అంధకారంలో పడిపోతుందని.. ఇలాంటి ముందస్తు జాగ్రత్తలకు పలువురు నాయకులు, కబ్జాదారులు దిగినట్లుగా ప్రచారం సాగుతోంది.

టెన్షన్.. టెన్షన్..

వైట్ కాలర్ నేరస్తులపై యాక్షన్ తరువాత.. సీపీ అభిషేక్ మహంతి సొంత డిపార్టుమెంటుపైనే దృష్టి సారించబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు గత అధికార ప్రభుత్వానికి.. కబ్జాదారులకు అండగా నిలిచిన ఖాకీలపై చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. అందులో ముగ్గురు సీనియర్ ఆఫీసర్లు ఉన్నట్లు వినికిడి. లాంగ్ స్టాండింగ్ ఇక్కడే డ్యూటీలు చేయడం.. ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉండడంతో వారికి అన్నివిధాలా కలిసివచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. వారు చేసిన దందాలు.. తదితర అన్యాయాలపై సీపీ ఫైల్ సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. సొంత డిపార్ట్‌మెంట్ ప్రక్షాళన తరువాత రెవెన్యూ డిపార్ట్‌మెంట్, రిజిస్ర్టేషన్ల శాఖ, మున్సిపల్‌పై దృష్టి సారించనున్నట్లు సమాచారం. చాలావరకు దొంగ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు వస్తుండడం.. వాటివెనుక ఆయా డిపార్ట్‌మెంట్ల అధికారులు ఉండడంతో ఆ దిశగా విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా కరీంనగర్ భూ కబ్జాకోరుల నుంచి కాపాడుతున్న పోలీస్ బాస్‌కు సామాన్య ప్రజలు ‘సెల్యూట్ సర్’ అని చెబుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page