- చట్టం ముందు అందరూ సమానులే
- ప్రత్యేక మినహాయింపులు ఎవరికీ ఉండవు.
కరీంనగర్ క్రైమ్ జనతా న్యూస్: నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున బుధవారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్ సెంటర్ ను కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి పరిశీలించారు. నామినేషన్ సెంటర్ వద్ద తీసుకున్న భద్రతా చర్యలు, కేటాయించబడ్డ సిబ్బంది గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రెండు రోజుల్లో నామినేషన్ లు వేసే వారి సంఖ్య పెరుగనున్నందున బందోబస్తు కోసం సరిపడా సిబ్బందిని కేటాయించామన్నారు. స్థానిక పోలీసులతోపాటు కమీషనరేట్ హెడ్ క్వార్టర్ నుండి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీములను మరియు బిఎస్ఎఫ్ బలగాలను కేటాయించామన్నారు.
నామినేషన్ సెంటర్ వద్ద ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించకుండా, 100 మీటర్ల వరకు ఎవరికి అనుమతి లేదని, నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే లోపలికి అనుమతించేలా, ప్రవేశద్వారం వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ అమర్చడంతోపాటు సిబ్బందిని కూడా కేటాయించి నామినేషన్ కు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనధికారిక వస్తువులేవి లోపలికి తీసుకెళ్లకుండా చర్యలు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో కమిషనరేట్ లోని అవసరమైన అన్నిచోట్ల ఫ్లాగ్ మార్చ్ లు, రూట్ మార్చ్ లు నిర్వహిస్తామని, భారత ఎలక్షన్ కమిషన్ చే జారీ చేయబడిన నియమాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉందని, ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని, రాజకీయ పార్టీలకు వ్యక్తులకు అతీతంగా నియమావళిని అమలు చేస్తామన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లేదా ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించే వారిని గుర్తించి వెంటనే వారిపై కేసులు నమోదుచేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయుటకు భారీ సంఖ్యలో ప్రజలతో ర్యాలీలు నిర్వహించుటకు అనుమతి తీసుకుంటున్నారని, అనుమతి పరిమితులు అతిక్రమించిన వారిని గుర్తించి రాజకీయ పార్టీలు,వ్యక్తులకు అతీతంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులు నమోదు చేస్తామన్నారు. గడచిన 7 రోజుల్లో ఎన్నికల నియామావళి ఉల్లంఘనగా 45 కేసులు నమోదు చేశామన్నారు.
పోలింగ్ రోజు మాత్రమే అప్రమత్తంగా ఉండడం కాకుండా, ప్రిపోలింగ్ లో భాగంగా ఇప్పటి నుంచే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. సమస్యాత్మక మరియు సున్నితమైన పోలింగ్ కేంద్రాలపై ఇప్పటినుండే ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఈ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువ ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించి ప్రజల్లో ఎన్నికల పై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ ప్రాంతాల్లో వుండే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు ఎన్నికల నియమావళికి భంగం కలిగించే చర్యలకు పాల్పడే వారిని ఇప్పటికే దాదాపు గుర్తించి సంబంధిత అధికారుల ముందు బైండ్ ఓవర్ చేశామని, ఒకవేళ దాన్ని కూడా ఉల్లంఘీస్తే బాండ్ పై ఉన్న పూచికత్తు మొత్తాన్ని జప్తు చేయడంతో పాటు జైలు శిక్ష కూడా విధించబడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాల కీలకమైనదని, ఎవరైనా వ్యతిరేఖ చర్యలకు పాల్పడితే పోలీస్ పరంగా చాల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చట్టం ముందు అందరూ సమానమే. ప్రత్యేక మినహాయింపులు ఎవరికీ ఉండవన్నారు. భారత ఎన్నికల సంఘంచే జారీ చేయబడిన నియమాలను పక్కగా అమలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి, హుజురాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.