బండ్లు ఓడలవుతాయి… ఓడలు బండ్లు అవుతాయి అనే సామెత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వర్తిస్తుంది. పదేళ్ల పాటు వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రాగా… ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొన్నటి వరకు ఓవర్ లోడ్ తో ఉన్న కారు… ఇప్పుడు ఖాలీ అవుతుంటే… నాయకులంతా చేతిలో చేయి కలుపుతూ హస్తం పార్టీ వైపు పరుగులు పెడుతున్నారు. నాయకులు కారును కాదంటూ గులాబీ నేతలకు గుడ్ భై చెబుతూ… కాంగ్రెస్ నేతలకు జై కొడుతున్నారు. గల్లీ నుండి మొదలుకుని భాగ్యనగరం వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
కరీంనగర్, జనతా న్యూస్: . టీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఇతర పార్టీల నుండి వలసల పరంపర కొనసాగి కారు ఓవర్ లోడ్ అయింది. టీఆర్ఎస్ పేరుతో రెండుసార్లు అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ గా మారి అపజయాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన కారు పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠమెక్కింది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ జిర్లా ఆయువుపట్టుగా నిలిచింది. తెలంగాణ సిద్దించాక రాష్ర్ట ప్రజలు ఆశీర్వదిస్తే పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ కి కరీంనగర్ జిల్లాలో ఎదురులేకుండా పోయింది.
For Janatha E paper click Here
Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)
ఇదిలా ఉంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ జిల్లాలో ఉద్యమ పార్టీకి గడ్డుకాలం ఎదురవుతోంది. తెలంగాణ రాష్ర్టంలో మొన్నటి వరకు ఎదురులేకుండా పోయిన బీఆర్ఎస్ పార్టీకి మనుగడ కరువయ్యే పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్నపుడు నాయకులతో కిక్కిరిసిపోయిన కారు ఇప్పుడు ఖాళీ అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఐదు స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్లమెంట్ స్థానాలను గెలుచుకునేందుకు పావులు కదుపుతోంది. ఐదు స్థానాలకు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. అధికారం కోల్పోవడంతో కారు నాయకులు పలువురు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఒక్కొక్కరుగా ముఖ్య నాయకులు పార్టీని వీడడంతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పరభవాన్ని చవి చూసిన బీఆర్ఎస్ పార్టీ కి పార్లమెంట్ ఎన్నికలు సవాల్ గా మారాయి. ఓ పక్క పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుంటే… మరో పక్క కారు నాయకులు కాంగ్రెస్ లోకి క్యూ కట్టడం బీఆర్ఎస్ ని కలవర పరుస్తుంది. చేరికలతో కాంగ్రెస్ లో జోష్ పెరుగుతుంటే… బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు ఢీలా పడుతుందనే చెప్పొచ్చు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో చాలా మంది నాయకులు హస్తం గూటికి చేరారు. మండల స్థాయి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు కాంగ్రెస్ లో చేరుతుంటే… బీఆర్ఎస్ నేతలు దిక్కుతోచని స్థితికి పరిమితమవుతున్నారు. కరీంనగర్ నగరంలో సైతం ఇటీవల కార్పోరేటర్లు కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ కి పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ఇంకా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు చేరికలతో కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుంటే… ఉన్న వారిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ అష్టకష్టాలు పడుతుందనే చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు ప్రజలు ప్రతీకారం తీర్చుకుని బీఆర్ఎస్ ని ప్రతిపక్షానికి పరిమితం చేస్తే… ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు పార్టీలు మారుతూ అభ్యర్థులను కలవరపెడుతున్నారు. ఇదిలా ఉంటే మోడీ క్రేజీతో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాతో ఉన్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్ స్థానాన్ని మళ్లీ చేజిక్కుంచుకునేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే… కాంగ్రెస్, బీజేపీలు గెలుపు కోసం తహతహలాడుతున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలతనే ఎదురవుతోంది. ఇప్పటికే ప్రజల నిర్ణయం వ్యతిరేకంగా ఉండడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు నాయకులు, క్యాడర్ దూరం అవ్వడంతో మరింత ప్రతికూలత ఎదురైంది. ఓటమి నుండి తేరుకోని బీఆర్ఎస్ కి నాయకులు గుడ్ భై చెప్పడం… మూలిగే నక్కపై తాడిపండు పడినట్లుగా అయింది. ప్రజా అనుకూలతో కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే… అధికార కాంగ్రెస్ లో చేరుతున్న నాయకుల తీరు కారు పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు వలసలతో బీఆర్ఎస్ కి షాక్ లు తగులుతున్నాయి.పరిస్థితి ఇలానే కొనసాగితే బీఆర్ఎస్ చక్కదిద్దుకునే లోపు కాంగ్రెస్, బీజేపీలు మొదటి రెండు స్థానాల కోసం పోటీ పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకత్వం ఇంటి పోరును… బయటి పోరును జయిస్తే మెరుగైన ఫలితం దక్కే అవకాశం ఉంది.