- తీవ్రంగా మంతనాలు జరుపుతున్న అధిష్టానం
- బీసీ అభ్యర్తివైపే మొగ్గు
- చివరి జాబితాలో అధికారికంగా ప్రకటన
- జోరుగా ప్రచారం
- నియోజకవర్గంలో ఆసక్తిని రేపుతున్న రాజకీయాలు
Karimnagar Assembly : కరీంనగర్ ప్రతినిధి, జనతా న్యూస్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు తేలిపోయారు. కానీ కీలకంగా ఉన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠంగా మారింది. ఈ తరుణంలో బొమ్మకల్ మాజీ సర్పంచ్ పురమళ్ల శ్రీనివాస్ పేరు తీవ్రంగా ప్రచారం అవుతోంది. గత కొన్ని రోజులుగా తనకే టికెట్ ఇవ్వాలని పురమళ్ల శ్రీనివాస్ విపరీతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకే టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు పార్టీలో కొత్తగా చేరిన కొత్త జయపాల్ రెడ్డికి టికెట్ వస్తుందని అనుకున్నారు. ఆయన కూడా కరీంనగర్ లో విపరీతంగా ప్రచారం చేశారు. అయితే అధిష్టానం దరఖాస్తు చేసుకున్న వివిధ పేర్లను పరిశీలించిన తరువాత పురుమల్ల శ్రీనివాస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ నాలుగోసారి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ మరోసారి పోటీ చేస్తున్నారు. వీరిద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. పురమల్ల శ్రీనివాస్ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల పోటీ ఉంటుందని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ మొదటి జాబితాలో 53 మందిని, రెండో జాబితాలో 40 మంది పేర్లను ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారు. కానీ కరీంనగర్ అభ్యర్థి తేలకపోవడంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చివరి జాబితాలో కరీంనగర్ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
మరోవైపు తమ పార్టీ బీసీలను ముఖ్యమంత్రి చేస్తానని బీజేపీ ప్రకటించడంతో కాంగ్రెస్ సైతం తాము బీసీల పక్షాన ఉన్నామనే భావన తీసుకురావడానికి ఎక్కువగా బీసీలకు టికెట్లు ఇస్తున్నామని అంటోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పురమళ్ల శ్రీనివాస్ కు కేటాయించాలని అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. పురమల్ల శ్రీనివాస్ సర్పంచ్ గా బొమ్మకల్ గ్రామంలో ప్రజలకు చేరువగా ఉన్నారని, అంతేకాకుండా కొన్ని ప్రత్యేక వర్గాలు ఆయనకు అనుకూలంగా ఉన్నట్లు ఆయన అనుచరులు పార్టీ అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.