- కరీంనగర్ బీజేపీలో అసమ్మతి సెగ
- ఎంపీ టికెట్ కోసం పోటాపోటీ
- సంజయ్ సీటుకు సుగుణాకర్ రావు ఎసరు
- ఎవరికివారుగా నగరంలో ప్రచారాలు
- సిట్టింగులకే ప్రాధాన్యమని షా ప్రకటించారంటూ లీకులు
- అయినా.. వెనక్కి తగ్గని పొల్సాని
- అధిష్టానానికి ఇప్పటికే దరఖాస్తు
కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. ఎంపీ టికెట్ కోసం ఎన్నడూ లేని విధంగా ఈసారి పోటాపోటీ కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగిన బండి సంజయ్ కుమార్ ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్నారు. కొన్ని నెలల క్రితం వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా పదవిలో ఉన్న ఆయన మరోసారి కరీంనగర్ ఎంపీగా బరిలో దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. కానీ.. తొలిసారిగా ఆయనకు ఇంటిపోరు తప్పడం లేదు. సొంత పార్టీలో.. సొంత నియోజకవర్గం నుంచే ఆయనకు అసమ్మతి బెడద మొదలైంది. కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్ రావు సైతం ప్రయత్నాలు సాగిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయన ఎంపీ టికెట్ కోసం అధిష్టానానికి సైతం దరఖాస్తు చేసుకోవడం పార్టీలో కలకలం రేపుతోంది.
బండికి అసమ్మతి పోరు..
కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దాంతో 2019లో లోక్‌సభకు పోట చేసి విజయం సాధించారు. అయితే… రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మరోసారి లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని రంగం సిద్ధం చేసుకుంటుండగా.. అనూహ్యంగా అసమ్మతి వెలుగులోకి వచ్చింది. ఇటీవల పలువురు అసమ్మతి నేతలు బండికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకున్నారు. సంజయ్‌కి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని.. గెలుపు కోసం కృషి చేస్తామని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఈ పరిణామం కాస్త పార్టీలో తీవ్ర కలకలం సృష్టించింది. మరోమారు కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందాలని ఉవ్విళ్లూరుతున్న బండి సంజయ్‌కి ఈ పరిణామం షాక్‌కు గురిచేసింది.
కేంద్రంలో మోడీ.. కరీంనగర్‌కు పొల్సాని..
టికెట్ తనకే అని భావించిన బండి సంజయ్ ఇప్పటికే వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్‌తో ముందుకు సాగుతున్నారు. అయితే.. ఆయనకు పోటీగా పొల్సాని సుగుణాకర్ రావు పేరిట వాల్ పోస్టర్స్ వెలుగుచూశాయి. కేంద్రంలో మోడీ.. కరీంనగర్‌కు పొల్సాని సుగుణాకర్ రావు అంటూ కొత్త నినాదంతో ముందుకెళ్తున్నారు. దీంతో ఆయన కరీంనగర్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పకనే చెప్పారు. గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీచేసి ఓటమి పాలైన సుగుణాకర్ రావు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బరిలోకి దిగారు. ఆ సందర్భంలోనూ ఓడిపోయారు. దాంతో 2014 నుంచి ఇక్కడ బండి సంజయ్ పోటీచేస్తూ వస్తున్నారు. అయితే.. ఈసారి సంజయ్‌కి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. మరి అధిష్టానం సుగుణాకర్ రావు పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో తెలియకుండా ఉంది. సీనియర్ లీడర్ కావడంతో ఆయనకు కేంద్ర స్థాయిలో పరిచయాలు, పెద్దల ఆశీస్సులూ ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు మధ్యప్రదేశ్ పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న మురళీధర్ రావు సైతం సుగుణాకర్ రావుకు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంజయ్‌కి కాకుండా సుగుణాకర్ రావుకు టికెట్ కేటాయించాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం.
షా క్లారిటీ ఇచ్చారంటూ ప్రచారం..
పార్టీలో గ్రూపుల కొట్లాలకు తావులేదని.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని.. పార్టీ నిబంధనలను వ్యతిరేకిస్తే ఊరుకునేది లేదని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అదే సందర్భంలో సిట్టింగుల స్థానాలు సిట్టింగులకే అంటూ చెప్పారని పలువురు నేతలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో సుగుణాకర్ రావు మాత్రం తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి వస్తుంది..? అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సహకరిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
టికెట్ వస్తుందనే విశ్వాసం ఉంది..
– పొల్సాని సుగుణాకర్ రావు, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఈసారి నాకే తప్పకుండా కరీంనగర్ ఎంపీ టికెట్ వస్తుందని నమ్మకం ఉంది. అధిష్టానంపై పూర్తి విశ్వాసం ఉంది. టికెట్ కోసం ఇప్పటికే అధిష్టానానికి దరఖాస్తు ఇచ్చాను. ముందు నుంచి నేను ఇక్కడ సీనియర్ నాయకుడిని. ఖచ్చితంగా ఈసారి కరీంనగర్ బరిలో నేనే ఉంటాను.